‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనిధి శెట్టికి ఆ తర్వాత కెరీర్ మాత్రం ఆశించినంత రేంజ్ లో సాగడం లేదు. పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, వాటిని తన మార్కెట్ పెంచుకునేలా మార్చుకోవడం కష్టమవుతోంది. ఇప్పుడు వెంకటేష్‌తో చేసిన ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ కూడా ఆమె ఆశించిన స్థాయి విజయాన్ని అందించే పరిస్థితి కనిపించడం లేదు.
యష్ సరసన ‘కేజీఎఫ్’ రెండు భాగాల్లో నటించిన శ్రీనిధికి ఆ సినిమాల విజయంతో మంచి క్రేజ్ వచ్చింది. కానీ తర్వాత విక్రమ్‌తో చేసిన ‘కోబ్రా’ నిరాశపరిచింది. దాంతో కొంత గ్యాప్ వచ్చింది. ఎక్కువ సినిమాలు ఒప్పుకోకుండా కథలు, పాత్రల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నా, ఆ స్థాయికి తగ్గ అవకాశాలు వరుసగా రాలేదు.
తెలుగులో మాత్రం గతేడాది శ్రీనిధికి అవకాశాలు పెరిగాయి. నానితో చేసిన ‘హిట్ 3’ మంచి విజయం సాధించింది. కానీ సిద్ధూ జొన్నలగడ్డ సరసన నటించిన ‘తెలుసు కదా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఒకే ఏడాది రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనప్పటికీ, హీరోయిన్గా ఆమెకు ప్రత్యేకమైన కమర్షియల్ బ్రేక్ మాత్రం దక్కలేదు.
ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సరసన నటించే అవకాశం రావడంతో శ్రీనిధి కెరీర్‌కు మరో మంచి ఛాన్స్ దొరికింది. ఈ సినిమా కథ వినగానే ఒప్పుకున్నానని, త్రివిక్రమ్‌తో పనిచేయడం తన కోరికల్లో ఒకటని ప్రమోషన్లలో చెప్పారు. అయితే విడుదల తర్వాత సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫస్ట్ వీకెండ్లో వసూళ్లు వచ్చినా ఆ తర్వాత మళ్ళీ పెరిగింది లేదు.
ఇక శ్రీనిధి ఇటీవల తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ‘కేజీఎఫ్’ తర్వాత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. డబ్బు కోసమే సినిమాలు చేయడం లేదని, మంచి పాత్రల కోసం చూస్తున్నానని వివరించారు. ఎనిమిదేళ్లలో తక్కువ సినిమాలే చేసిన శ్రీనిధి నెక్స్ట్ స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates