అక్క వివాదాలు కావాలనే వస్తున్నాయా

ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో కొత్త వెబ్ సిరీస్ ‘అక్క’ స్ట్రీమింగ్ అవుతోంది. కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ట్రైలర్ వచ్చినప్పుడు అంచనాలు బాగానే రేగాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. అయితే పబ్లిక్ టాక్, రివ్యూలు ఆశించినంత పాజిటివ్ గా లేకపోవడంతో బ్లాక్ బస్టర్ ఫలితం ఊహించుకున్న దర్శక నిర్మాతలు కొంత నిరాశ చెంది ఉంటారు. వ్యూస్ భారీగా వస్తున్నాయి కానీ పబ్లిక్ రెస్పాన్స్ అనుకున్నంత గొప్పగా లేదన్నది వాస్తవం.

అయితే ఏదో ఒక రూపంలో అక్క వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా రాధికా ఆప్టే ఇటీవలే అక్క కోసం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల గురించి, అందులోనూ ఒక సీనియర్ స్టార్ సరసన తాను నటించిన బ్లాక్ బస్టర్ గురించి వ్యంగ్యంగా చేసిన కామెంట్లు పెద్ద దుమారమే రేపాయి. హిందీలో విచ్చలవిడిగా బోల్డ్ కంటెంట్ లో నటిస్తూ తెలుగు తమిళంలోనే బూతులు, గ్లామర్ షో ఎక్కువ చేస్తారనే రీతిలో ఆమె పలికిన అర్థం లేని మాటలు నెటిజెన్ల గురించి లెక్కలేనన్ని కౌంటర్లు ఎదురుకునేలా చేశాయి.

ఇవన్నీ రాధికా ఆప్టే పట్టించుకుంటుందో లేదో కానీ అక్క మాత్రం ఈ రకంగా అయినా ఫోకస్ లో ఉంటోంది. ఎనభై దశకంలో తమిళనాడులోని ఒక ప్రాంతం పూర్తిగా మహిళల ఆధిపత్యంలో ఉంటుంది. భవాని, రుద్ర అనే ఇద్దరు యువతుల మధ్య జరిగే ఆధిపత్య పోరే ఈ అక్క. గ్యాంగ్ స్టర్ డ్రామా, కుట్రలు కుతంత్రాలు, ట్విస్టు అన్నీ ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే రెగ్యులర్ అనిపించడం, ఎమోషన్స్ సరిగా పండకపోవడం, క్యారెక్టరైజేషన్ లోపాలు మైనస్ గా నిలిచాయి.

ఒకవేళ పబ్లిసిటీ ఈ రకంగా అయినా వస్తే మంచిదే కదాని రాధికా ఆప్టే లాంటి వాళ్ళు అలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారో ఏమో కానీ యష్ సంస్థ మీద కొందరికి అనుమానం లేకపోలేదు. ఆ మధ్య మర్దానీ 3 రిలీజ్ సందర్భంగా చిన్న పిల్లల కిడ్నాప్ టాపిక్ గా అతిగా ప్రాజెక్ట్ చేయడం జనాలు మర్చిపోలేదు. సయారా బ్లాక్ బస్టరే కానీ ఓపెనింగ్ వారంలో దాని కోసం మార్కెటింగ్ గిమ్మిక్కులు చాలానే జరిగాయి. మరి అక్కకు ప్లాన్డ్ గా అయ్యాయో లేక కాకతాళీయమో ఎవరూ చెప్పలేరు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.