టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరయ్యా అంటే ఇప్పటికీ ముందు వరసలో వినిపించే పేరు తమన్. అయితే తన స్థాయికి తగ్గ ఆల్బమ్స్ ఇవ్వలేకపోతుండటంతో వాటి ప్రభావం సినిమా ఫలితాల మీద కూడా పడుతోందని అభిమానులు వాపోతున్నారు. తాజాగా విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకే 47లో పేరుకు ఎనిమిది పాటలు ఉన్నాయన్న మాటే కానీ ఏ ఒక్కటీ రాములో రాములా, కుర్చీ మడతపెట్టి రేంజులో సగం కూడా లేవు. దీనికన్నా ముందు వచ్చిన సిగ్మా పరిస్థితి ఎంత అన్యాయమో చెప్పనక్కర్లేదు.
ఇంకా వెనక్కు వెళ్తే ఒక్క లెనిన్ మాత్రమే మ్యూజిక్ పరంగా డీసెంట్ అనిపించుకుంది. కమర్షియల్ గా వర్కౌట్ అయిన కొరియన్ కనకరాజు కామెడీ వల్ల ఆడింది తప్పింది సంగీతం విషయంలో దానికొచ్చిన పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పెద్దగా లేదు. రాజా సాబ్, అఖండ 2 తాండవం, తెలుసు కదా ఇలా వేర్వేరు జానర్ల నుంచి అవకాశాలు వచ్చినా వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరుచుకోలేకపోవడం పొరపాటు కాదు తప్పే. ఒక్క ఓజి మాత్రమే తమన్ పనితనం మీద కంప్లయింట్స్ రాకుండా కాపాడింది.
హెడ్డింగ్ లో తుఫాను అని చెప్పడానికి కారణం ఉంది. మన టాలెంట్ ఇలా వెనుకబడటంతో పక్క రాష్ట్రాల మ్యూజిక్ సెన్సేషన్లు మన దగ్గర దూసుకెళ్తున్నాయి. నాని జెర్సీ నుంచి రామ్ చరణ్ 17 దాకా అనిరుధ్ రవిచందర్ అందుకున్న అవకాశాలు ఎన్నో వేరే చెప్పాలా. అల్లు అర్జున్ రాకాతో ఎంట్రీ ఇస్తున్న సాయి అభ్యంక్కర్ ఆ సినిమా రిలీజయ్యాక తనతో సంతకం చేయించుకునేందుకు రెడీగా ఉన్న టాలీవుడ్ ప్రొడ్యూసర్ల లిస్టు చాంతాడంత ఉంది. దేవిశ్రీ ప్రసాద్ హీరో అయిపోయి బయట కమిట్మెంట్స్ ఇవ్వడం లేదు.
తమన్ తన సత్తా తిరిగి ఇప్పుడైనా చాటుకోవచ్చు. చిరంజీవి కాకా, బాలకృష్ణ దాదా ఈ రెండు తక్కువ గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. మరోసారి తన మార్క్ మ్యూజిక్ ఇస్తే ఇప్పుడు కామెంట్స్ చేస్తున్న నోళ్లు మూతబడతాయి. డాకు మహారాజ్, గాడ్ ఫాదర్ కిచ్చిన బిజిఎం గురించి ఇప్పటికీ ఫ్యాన్స్ ఎలా మాట్లాడుకుంటారో తెలిసిందే. ఈ నెల 13 విడుదల కాబోతున్న ఇట్లు అర్జునకి ఇండస్ట్రీ నుంచి సాలిడ్ బ్యాకప్ కనిపిస్తోంది. తమన్ ముద్ర అందులో బలంగా వినిపించినా ప్రస్తుతానికి సరిపోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates