సందీప్ వీటికి దూరంగా ఉంటే బెటర్

ఇటీవలే అనంతపురం జిల్లా రాప్తాడులో ఒక విద్యార్థినిపై మెషీన్ రంపంతో దాడి జరిగిన సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. దానికి పాల్పడ్డ ఉన్మాదిని పోలీసులు పట్టుకోవడం, ఆ ప్రయత్నంలో వాడికి బుల్లెట్ తగిలి కాలు తీసేయాల్సి రావడం, రాష్ట్రంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా చర్చనీయాంశంగా మారాయి. ఒక అమాయికురాలి జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకున్న దుష్టుడికి ఇలాంటి శిక్ష పడాల్సిందే అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు అధిక శాతం ఉన్నారు.

ఇదిలా ఉండగా ఇలాంటి దుర్ఘటనలు సినిమాల వల్లే జరుగుతున్నాయనే డిబేట్ ఒకటి సోషల్ మీడియాలో మొన్నటి నుంచి జరుగుతూనే ఉంది. కొందరు యానిమల్ లో రన్బీర్ కపూర్ తుపాకీని క్లాస్ రూమ్ కు తీసుకెళ్లే సీన్ ఉదాహరణగా చూపించి రెండింటికి ముడి పెడుతున్నారు. తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దీనికి స్పందించడం హాట్ టాపిక్ అయ్యింది. బాధితుల పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి ఇలా సినిమాల మీద బురద చల్లడం ఏమిటని ఘాటుగా ట్వీట్ చేశారు.

చెప్పాలంటే ఇలాంటి టైంలో సందీప్ వంగా లాంటి వాళ్ళు ఈ తరహా కాంట్రావర్సీలకు దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే రెస్పాండ్ అయ్యే కొద్దీ కార్చిచ్చులా మారే ఇలాంటి సున్నితమైన విషయాలు డిస్కషన్ ని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఆ దాడి చేసిన వాడు యానిమల్ చూశాడా లేక ఇంకేదైనా వెబ్ సిరీస్ ఫాలో అయ్యాడా ఎవరికి తెలియదు. అలాంటప్పుడు సందీప్ వంగా తానుగా బదులు చెప్పే ప్రయత్నం చూస్తుంటే తనని టార్గెట్ చేస్తున్న వాళ్ళ ట్రాప్ ఫలిస్తున్నట్టే కనిపిస్తోంది.

మౌనం కన్నా ఉత్తమమైన మార్గం మరొకటి లేదు. ముందు సందీప్ వంగా దృష్టి పెట్టాల్సింది స్పిరిట్ మీద. ఆల్రెడీ మార్చి నుంచి అక్టోబర్ కు వెళ్ళిపోయింది. ఆ డేట్ మిస్ కాకుండా బెస్ట్ ఇచ్చేందుకు ఏమేం చేయాలో మరోసారి ప్లాన్ చేసుకోవాలి. ప్రభాస్ ఫ్యాన్స్ అంచనాలు ఈ ప్రాజెక్టు మీద మాములుగా లేవు. ఫౌజీ, కల్కి, సలార్ ని మించిన ఆశలు దీని మీదే పెట్టుకున్నారు. వయొలెన్స్ ఎంత ఉన్నా దానికి సహేతుకమైన కారణం పెట్టే సందీప్ వంగా ఈసారి ఏమేం చేస్తారో చూడాలి.