‘ఆదర్శ కుటుంబం’పై ‘జిమ్ జిమ్ తార’ లక్ష్మి ఫైర్

సోషల్ మీడియా వల్ల ఎప్పుడు ఎవరు హీరోలవుతారో, జీరోలవుతారో చెప్పలేం. అనుకోకుండా పాపులారిటీ సంపాదించి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోతుంటారు కొంతమంది. ఈ మధ్య కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మి ఆంటీ అనే మహిళ ఇలాంటి పాపులారిటీనే సంపాదించింది. ఆమె పాడిన పల్లె పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. 

జిమ్ జిమ్ తారా అని ఒక పాట, అత్తరు సాయిబు మంచోడమ్మా అని ఇంకో పాట.. సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి. లక్ష్మి మామూలుగానే ఆ పాటలు పాడినా.. వాటిని భలేగా రీమిక్స్ చేయడంతో సోషల్ మీడియా జనాలను ఆ పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. ఐతే ఇందులో ‘జిమ్ జిమ్ తార’ పాటను ‘పర్ణశాల’ అనే చిన్న సినిమా కోసం కంపోజ్ చేశారని.. సినిమా నుంచి రిలీజ్ చేయడానికి ముందే అనుకోకుండా అది లీక్ అయి వైరల్ అయిందని తర్వాత తెలిసింది.

ఐతే ఈ శుక్రవారం రిలీజైన విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో ఈ పాటను వాడేయడం చర్చనీయాంశం అయింది. సినిమాలో ఒక చోట బ్యాగ్రౌండ్లో ఈ పాట వినిపిస్తుంది. థియేటర్లలో ఆ సన్నివేశానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ మధ్యే పాపులర్ అయిన పాటను సినిమాలో పెట్టేశారేంటి అని అంతా ఆశ్చర్యపోయారు. ఐతే ఈ సాంగ్ వాడేటపుడు ‘ఆదర్శ కుటుంబం’ టీం ‘పర్ణశాల’ మేకర్స్ నుంచి అనుమతి తీసుకోలేదట. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ‘పర్ణశాల’ టీం ‘ఆదర్శ కుటుంబం’ మేకర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా సింగర్ లక్ష్మి.. వెంకీ అండ్ టీమ్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చింది. మా పర్మిషన్ లేకుండా, డబ్బులు ఇవ్వకుండా ఎలా ఆ పాట వాడుకుంటారు.. వెంటనే పాట తీసేయకపోతే కేసులు పెడతాం అంటూ కర్నూలు స్లాంగ్‌లో ఆమె వార్నింగ్ ఇచ్చారు. ‘ఆదర్శ కుటుంబం’ మీద చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు ‘పర్ణశాల’ టీం హెచ్చరించింది.