ఏఐ కామెంట్స్… సల్మాన్‌కు కోపమొచ్చింది

వాయిదాల మీద వాయిదాలు పడి డిసెంబరు 4న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ‘మాతృభూమి’ చుట్టూ విపరీతమైన నెగెటివిటీ ముసురుకున్న సంగతి తెలిసిందే. బాగా ఆలస్యం అయిన ఈ సినిమా నుంచి కొన్ని రోజుల ముందు ట్రైలర్ లాంచ్ చేయగా.. దాని మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది.

ట్రైలర్ లెంత్ చాలా ఎక్కువ ఉండడం.. చాలా షాట్స్ కృత్రిమంగా అనిపించడం.. సల్మాన్ లుక్స్ రకరకాలుగా ఉండడం మీద నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఏఐని మరీ ఎక్కువగా వాడారని.. చాలా సీన్లు ఆర్టిఫిషియల్‌‌గా అనిపించాయని నెటిజన్లు కామెంట్లు చేశారు. ఈ విమర్శలు, ట్రోల్స్ మీద సల్మాన్ తాజాగా స్పందించాడు. ముఖ్యంగా ఏఐ వినియోగం మీద వచ్చిన కామెంట్స్ ఆయనకు తీవ్ర ఆగ్రహమే తెప్పించాయి.

‘‘మా సినిమాలో ఏఐ ఉపయోగించారని విమర్శిస్తున్నారు కదా. వాళ్లేమైనా ఏఐ నిపుణులా.. వీఎఫెక్స్ స్పెషలిస్టులా.. మీ కామెంట్లు అన్నీ నా దృష్టికి వస్తున్నాయి. నిజమైన లొకేషన్లలో షూట్ చేసిన సన్నివేశాలను కూడా వీఎఫెక్స్ అని, ఏఐ అని ఆరోపించడం కరెక్ట్ కాదు. నా సినిమా గురించి, నా గురించి చెడుగా మాట్లాడడం వల్ల ఎవరికైనా వ్యూస్, ఫాలోవర్లు వస్తుంటే నాకు అభ్యంతరం లేదు. నా కారణంగా వాళ్లు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటూ ఉంటే నాకు సంతోషమే. దేవుడు వారిని చల్లగా చూడాలి.

ట్రైలర్ చాలా పెద్దగా ఉందని, అందులోనే సినిమా మొత్తం చూపించేశారని కొందరు అంటున్నారు. మేం సినిమా మొత్తాన్ని చూపించలేదు. డిసెంబరు 4న సినిమా చూసినపుడు మీకు విషయం అర్థమవుతుంది. కవర్ పేజీని చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదని అంటారు. మా సినిమా కూడా అంతే. ఇందులో అనూహ్యమైన మలుపులు ఉన్నాయి. ఐదు నిమిషాల ట్రైలర్లోనే మీకు అన్ని పాయింట్స్ కనిపిస్తే.. రెండున్నర గంటల సినిమాలో ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోండి’’ అని సల్మాన్ వ్యాఖ్యానించాడు. అపూర్వ లఖియా రూపొందించిన ‘మాతృభూమి’ని సల్మానే స్వయంగా నిర్మించడం విశేషం.