తమన్ గమనిస్తున్నాడా?

తెలుగులో కొన్నేళ్ల నుంచి నంబర్ వన్ సంగీత దర్శకుడిగా కొనసాగుతున్నాడు తమన్. వేరే భాషల్లోనూ తరచుగా సినిమాలు చేస్తున్నాడు. తన సినిమాల స్థాయి ప్రకారం చూసినా, క్వాంటిటీ పరంగా చూసినా అతడికి దరిదాపుల్లో కూడా ఇంకెవరూ లేరు. కానీ తన సంగీతంలో క్వాలిటీ గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. 

ఈ ఏడాది సంక్రాంతికి ‘ది రాజాసాబ్’తో మొదలుపెట్టి.. లేటెస్ట్‌గా ‘ఆదర్శ కుటుంబం’ వరకు చాలా క్రేజీ ప్రాజెక్టులకు అతను సంగీతం అందించాడు. వీటిలో ‘లెనిన్’ను మినహాయిస్తే మంచి అప్లాజ్ తెచ్చుకున్న సినిమా ఏదీ లేదు. అందులో పాటలకు మంచి స్పందన వచ్చింది. బీజీఎం పర్వాలేదనిపించింది. మిగతా సినిమాలకు ఇటు పాటలు, అటు బీజీఎం రెంటి విషయంలోనూ విమర్శలు తప్పలేదు. ముఖ్యంగా లేటెస్ట్ రిలీజ్‌ ‘ఆదర్శ కుటుంబం’ విషయంలో అయితే ట్రోల్స్ మామూలుగా లేవు.

త్రివిక్రమ్ సినిమాలంటే సంగీత దర్శకుడు ఎవరైనా పాటలు ఎంతో బాగుంటాయని ఆశిస్తారు ప్రేక్షకులు. తమన్‌తో కూడా ‘అరవింద సమేత’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలకు అదిరిపోయే ఆల్బమ్స్ చేయించుకున్నాడు త్రివిక్రమ్. వాటితో పోలిస్తే ‘గుంటూరు కారం’ రేంజ్ తగ్గింది కానీ.. అందులో కూడా ‘కుర్చీ మడత పెట్టి’ పాటతో ఒక ఊపు ఊపాడు తమన్. కానీ ‘ఆదర్శ కుటుంబం’కు వచ్చేసరికి చెప్పుకోదగ్గ పాట ఒక్కటీ లేదు.

పాత పాటను కాపీ కొట్టి చేసిన ‘నారాయణమ్మ’ పర్వాలేదు. మిగతా పాటలన్నీ తేలిపోయాయి. సినిమాకు సంగీతం ఏమాత్రం ఆకర్షణ కాలేకపోయింది. బీజీఎం అయితే మరీ రొటీన్‌గా అనిపించింది. ఎన్నోసార్లు విన్న సౌండ్లతోనే మమ అనిపించేశాడు తమన్. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా.. సంగీతం విషయంలో మాత్రం సర్వత్రా విమర్శలే వస్తున్నాయి. సినిమా చూసిన వాళ్లు తమన్‌ను ఆటాడేసుకుంటున్నారు సోషల్ మీడియాలో.

తమన్ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తన మీద ఏ స్థాయిలో విమర్శలు వస్తున్నాయో తనకు తెలియకుండా ఉండదు. ఇంతకుముందులా అనేవాళ్లు అంటుంటారు అని దులుపుకుని వెళ్లిపోతే కష్టం. ఇప్పుడు వస్తున్న నెగెటివిటీ మరీ టూమచ్‌గా ఉంది. నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకుని రాబోయే చిత్రాలకు బెటర్ మ్యూజిక్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల క్వాలిటీ మీద ప్రభావం పడుతోందన్నది వాస్తవం. అలాంటపుడు సినిమాలు తగ్గించుకుని అయినా ఔట్ పుట్ బెటర్‌గా ఉండేట్లు చూసుకోకపోతే.. నెగెటివిటీ మరింత తీవ్రమవడం ఖాయం.