ఇప్పటివరకు చూడని సూర్యావతారం

ఎన్నో ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ సూపర్ స్టార్ సూర్య.. ఈ ఏడాది రెండు భారీ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. వేసవిలో ‘కరుప్పు’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సూర్య.. ఇంకో మూడు నెలలకు ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మరో ఘనవిజయాన్నందుకున్నాడు. విశేషం ఏంటంటే.. ఇంకో మూడు నెలల్లోపే తన సినిమా ఇంకోటి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అదే.. సీన్.

‘ఆవేశం’ సినిమాతో మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జీతు మాధవన్ రూపొందించిన చిత్రమిది. ఇందులో డీఎస్పీ ఇన్బరాజ్ అనే పాత్రలో నటించాడు సూర్య. ఈ సినిమా నుంచి ఇంతకుందు రిలీజ్ చేసిన ప్రోమోలు క్రేజీగా అనిపించాయి. సూర్య చాలా భిన్నంగా కనిపించాడు. ఇప్పుడు ‘సీన్’ ట్రైలర్ కూడా లాంచ్ అయింది. అది టీజర్‌ను మించి క్రేజీగా అనిపిస్తోంది.

సూర్య ఇంతకుముందు పోలీస్ పాత్రలు చేశాడు కానీ.. అవి చాలా మాస్‌గా ఉండేవి. కానీ ఈసారి వెరైటీ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు సూర్య. తెలుగులో వచ్చిన శివమణి కంటే తిక్క పోలీస్ క్యారెక్టర్‌లా ఉంది అది. బాగా ఇగోయిస్ట్ అయిన ఈ పోలీస్ ఏదో తప్పు చేసి సస్పెండ్ అవుతాడు. కానీ అతను ఇన్వెస్టిగేషన్‌లో తోపు. దీంతో పోలీసులకు సవాలుగా మారిన ఒక కేసును ఛేదించడం కోసం అతణ్ని అనఫీషియల్‌గా విధుల్లోకి తీసుకుంటారు. ఐతే ఈ తిక్క పోలీస్‌తో డీల్ చేయడం చాలా కష్టమవుతుంది. కానీ తప్పదు. మరి అతడితో మిగతా పోలీసులు పడ్డ పాట్లేంటి.. సవాలుగా మారిన కేసును సూర్య ఎలా ఛేదించాడు అన్నది మిగతా కథ.

పేరుకు పోలీసే కానీ.. సూర్య సినిమా అంతా ఒక అల్లరి కుర్రాడిలా కనిపించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. తన లుక్, హావభావాలు, డైలాగులు అన్నీ క్రేజీగా కనిపిస్తున్నాయి. మరోవైపు నస్లీన్ చేసిన విలన్ పాత్ర కూడా అంతే క్రేజీగా ఉంది. ఇద్దరి మధ్య క్లాష్ రసవత్తరంగా సాగేలా ఉంది. ట్రైలర్ అంతటా విజువల్స్, బీజీఎం డిఫరెంటుగా సాగాయి. ఒక క్రేజీ రైడ్ చూడబోతున్న ఫీలింగ్ కలిగించిందీ ట్రైలర్. ఇందులో ఫాహద్ ఫాజిల్ భార్య, ‘అంటే సుందరానికి’ ఫేమ్ నజ్రియా కథానాయిక పాత్ర చేసింది. దీపావళి కానుకగా నవంబరు 6న రాబోతున్న ‘సీన్’ సూర్య ఫిల్మోగ్రఫీలో ఒక స్పెషల్ ఫిల్మ్ అవుతుందనిపిస్తోంది. కాకపోతే మాస్ ప్రేక్షకులు ఈ సినిమాను ఏమాత్రం మెచ్చుతారన్నదే డౌట్.