రామాయ‌ణం.. ఒక్క స‌న్నివేశానికి ఆరున్న‌రేళ్లు

ఇప్పుడు ఇండియ‌న్ సినిమా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న‌ది రామాయ‌ణం సినిమా కోస‌మే. 4 వేల కోట్ల బ‌డ్జెట్ అని మొద‌లుపెట్టి, దీని గురించి మేక‌ర్స్ ఇస్తున్న హైప్ అంతా ఇంతా కాదు. రెండు భాగాల ఈ మెగా మూవీలో ఫ‌స్ట్ పార్ట్ ఇంకో అయిదు రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా వివిధ భాష‌ల్లో ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది రామాయ‌ణం టీం. తాజాగా ఒక కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌కుడు నితీశ్ తివారి.. రామాయ‌ణంలో ఒక సీక్వెన్స్ గురించి ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం చెప్పాడు. దాని కోసం ఏకంగా ఆరేళ్లకు పైగా స‌మ‌యం ప‌ట్టింద‌న్నాడు. అది రావ‌ణుడు, జ‌టాయువు మ‌ధ్య జ‌రిగే భీక‌ర పోరుకు సంబంధించిన స‌న్నివేశ‌మ‌ట‌.

”రావ‌ణుడు, జ‌టాయువు మ‌ధ్య పోరాట దృశ్యాన్ని పూర్తి చేయ‌డానికి ఆరున్న‌రేళ్లు ప‌ట్టింది. ఈ ఒక్క యాక్ష‌న్ సీక్వెన్స్ కోస‌మే చాలా స‌మ‌యం పెట్టాల్సి వ‌చ్చింది. వేలాదిమంది దాని కోసం క‌ష్ట‌ప‌డ్ఆరు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ విష‌యంలో అనేక మార్పులు చేయాల్సి వ‌చ్చింది. ఈ సీక్వెన్స్ రామాయ‌ణంలో అత్యంత కీల‌క‌మైంది. అందుకే అంత జాగ్ర‌త్త‌గా చేశాం. అలాగే పుష్ప‌క విమానం రూపాన్ని ఖ‌రారు చేయ‌డానికి రెండేళ్లు ప‌ట్టింది. 40, 50 డిజైన్లు రూపొందించి.. చివ‌ర‌గా ఒక‌టి ఫైన‌లైజ్ చేశాం” అని నితీశ్ తెలిపాడు.

రామాయ‌ణం సినిమా సెట్స్ మీదికి వెళ్లింది రెండేళ్ల ముందే కానీ.. దీని బ్యాగ్రౌండ్ వ‌ర్క్ దాదాపు ద‌శాబ్దం కింద‌టే మొద‌లైంది. 2016లో దంగ‌ల్ మూవీతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాక‌ నితీశ్ ద‌ర్శ‌క‌త్వంలో రామాయ‌ణం మెగా ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. అప్పుడు ఈ సినిమా నిర్మాత‌ల్లో అల్లు అర‌వింద్ కూడా ఒక‌రు. మ‌ధు మంతెనతో పాటు మ‌రో నిర్మాత కూడా ఇందులో భాగ‌మే. కానీ ఎందుకో వాళ్లంద‌రూ త‌ప్పుకుని ఈ సినిమా ఆగిపోయేలా క‌నిపించింది. కానీ త‌ర్వాత కొన్నేళ్ల‌కు న‌మిత్ మ‌ల్హోత్రా రంగంలోకి దిగి దీని లెవెలే మార్చేశారు. ర‌ణ‌బీర్ క‌పూర్, సాయిప‌ల్ల‌వి రాముడు, సీత‌గా.. య‌శ్ రావ‌ణుడిగా న‌టించిన రామాయ‌ణం వ‌చ్చే గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.