మైసా ఎంట్రీతో మరింత చిక్కుముడి

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా కొందరికి షాక్ కలిగించేలా వచ్చింది. సెన్సార్ కార్యక్రమం సోమవారం ఉన్నప్పటికీ డబ్బింగ్ వెర్షన్లకు సంబంధించిన ఫార్మాలిటీస్ కి సమయం పట్టేలా ఉండటంతో నిర్మాతలు పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే రెండు వారాలు లేట్ గా రావడం ఒక రకంగా మంచిదే కానీ ఆల్రెడీ అదే డేట్ మీద కర్చీఫ్ లు వేసిన చిన్న సినిమాలకు మరింత ఇబ్బంది కలగనుంది.

ప్రియదర్శి, నాగదుర్గ జంటగా రూపొందిన ‘ఇడుపు కాయితం’ మీద ఆల్రెడీ బయ్యర్ వర్గాల్లో మంచి బజ్ వచ్చేసింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో బలంగా కొడుతుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిర్మాత బన్నీ వాస్ మార్కెటింగ్ విషయంలో మంచి ప్లానింగ్ చేస్తున్నారట. అదే రోజు ఆయన మిత్రుడు వంశీ నందిపాటి నిర్మించిన ‘ఇంకా ఏం అనుకోలేదు’ కూడా బరిలో దిగుతోంది. ఈ రెండు కలిపి ఒకే టికెట్ మీద కాంబో ఆఫర్ ఇద్దామనే ఆలోచన ఇద్దరు మిత్రుల మధ్య ఉంది.

నీహారిక కొణిదెల నిర్మించిన ‘పాకెట్ రాకెట్స్’ మెల్లగా అంచనాలు పెంచుతోంది. స్టార్స్ లేకపోయినా కమిటీ కుర్రాళ్ళ తరహాలో కంటెంట్ ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. ఏళ్ళ తరబడి వాయిదాలో ఉన్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ‘టైసన్ నాయుడు’ని అదే డేట్ కి రిలీజ్ చేసే ప్రతిపాదన గురించి సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఇవి కాకుండా ‘రాయవలస’ కూడా రేసులో ఉంది. ఇప్పుడు ‘మైసా’ ఎంట్రీ ఇవ్వడం వల్ల థియేటర్ కౌంట్ పరంగా కొన్ని సినిమాలకు ఇబ్బంది తప్పదు.

ఇంకో సమస్య ఏమిటంటే వీటిలో ఏవైనా వాయిదా వేద్దామంటే ఆపై వారం పరిస్థితులు ఇంకా కఠినంగా ఉన్నాయి. డ్యూన్ 3, అవెంజర్స్ డూమ్స్ డే పెద్ద ఎత్తున రిలీజవుతున్నాయి. ఆ తర్వాత క్రిస్మస్ కి కింగ్ 100, కింగ్, దాదా, రియాలిటీ వస్తాయి. తోడుగా జుమంజి కొత్త వెర్షన్ దిగుతుంది. అందుకే డిసెంబర్ 11 విడుదలయ్యే సినిమాలకు పెద్ద సవాళ్లు ఎదురు కాబోతున్నాయి. ఒకవేళ ఏవైనా తప్పుకోవాల్సి వచ్చినా జనవరి 1కి వెళ్లడం మినహా వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. అప్పుడైనా సంక్రాంతి వరకే రన్ దొరుకుతుంది.