అయిదు సినిమాలు… ఎక్కడ చిరునామాలు

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాని పూర్తి చేయడం ఒక యజ్ఞం అనుకుంటే దాన్ని థియేటర్ల దాకా తీసుకురావడం ఇంకో మహా సంకల్పంగా మారుతోంది. కొత్త వాళ్ళతో సపోర్ట్ లేని నిర్మాతలకు ఇలాంటి ఇబ్బంది వస్తే ఏదో అనుకోవచ్చు. మార్కెట్, ఇమేజ్ ఉన్న వాళ్లకు సైతం ఈ సమస్య ఎదురైతే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. టాలీవుడ్ కు సంబంధించి అలాంటి బాపతు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని థియేటర్లకు వచ్చేందుకు మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’కు సంబంధించి ఇప్పటిదాకా సాలిడ్ అప్డేట్ లేదు. సంక్రాంతికి ట్రై చేస్తోందనే వార్త వచ్చాక మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ రావడం లేదు. నిన్న మొన్న స్టార్ట్ అయిన కాకా పండక్కు దిగుతున్నాడు. బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘టైసన్ నాయుడు’ రెండేళ్లకు పైగా ల్యాబ్ నుంచి బయటికి రావడం లేదు. 14 రీల్స్ బ్యానర్ లో అఖండ సీక్వెల్ ఫ్లాప్ అయ్యాక ఇది సందిగ్ధంలో పడిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.

నిఖిల్ సిద్దార్థ్ ఎంతో కష్టపడి చేసిన ‘స్వయంభు’ అదిగో ఇదిగో అంటూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హడావిడి చేయడం తప్పించి స్థిరంగా నిర్ణయం తీసుకోవడంలో తడబడుతూనే ఉంది. బడ్జెట్ చాలా భారీగా ఖర్చు పెట్టేశారు. అల్లరి నరేష్ హీరోగా సితార సంస్థ నిర్మించిన ‘ఆల్కహాల్’ అసలేమైందో అంతు చిక్కడం లేదు. ఇదే బ్యానర్ కొత్తవాళ్లతో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తీసిన ‘మేజిక్’ కూడా అంతుపొంతు లేకుండా అసలు ఊసులో పోయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చినా హైప్ రాలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇవన్నీ అగ్ర నిర్మాణ సంస్థలతో రూపొందినవే. ప్యాన్ ఇండియాలు తీసిన అనుభవంలో ఉన్నవి. కానీ వీటికి విడుదల కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ ఇలా బజ్ తగ్గుతూ పోతే దాని ప్రభావం నేరుగా ఓపెనింగ్స్ మీద పడుతుంది. హరిహర వీరమల్లు లాంటివి ఈ విషయంలో చాలా సఫరయ్యాయి. ఏదీ కావాలని చేయకపోయినా జరుగుతున్న డ్యామేజ్ ని పైన చెప్పిన సినిమాల యూనిట్లు వీలైనంత త్వరగా గుర్తిస్తే మంచిది.