అల్లరోడి తప్పటడుగు


పదేళ్ల ముందు టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న హీరోల్లో అల్లరి నరేష్ ఒకడు. అతను హీరోగా ఎప్పుడూ మూణ్నాలుగు సినిమాలు సెట్స్ మీద ఉండేవి. ఇంకో మూణ్నాలుగు సినిమాలు చర్చల దశలో ఉండేవి. అప్పట్లో అతడి ఫ్లాప్ సినిమాలు సైతం బ్రేక్ ఈవెన్ అయ్యేవి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కడం, ఓపెనింగ్స్‌కు ఢోకా లేకపోవడం అందుకు కారణం. దీని వల్ల అల్లరి నరేష్‌కు మినిమం గ్యారెంటీ అన్న గుర్తింపు ఉండేది. కానీ ఈ గ్యారెంటీని తర్వాత కోల్పోయాడు అల్లరోడు.

‘సుడిగాడు’ తర్వాత అతడి సినిమాలన్నీ వరుసగా పరాజయం పాలయ్యాయి. అందులోనే చేయాల్సిన స్పూఫ్‌లన్నీ చేసేయడంతో తర్వాత ఆ టైపు సినిమాలు వర్కవుట్ కాలేదు. జనాలు టీవీల్లో ‘జబర్దస్త్’కు అలవాటు పడిపోయి అల్లరోడి నుంచి ఇంకేదైనా భిన్నంగా ఆశించారు. కానీ అది అతను అందించలేకపోయాడు. మధ్యలో ‘మహర్షి’లో చేసిన క్యారెక్టర్ రోల్ కొంత ఉపశమనాన్ని అందించింది కానీ.. అల్లరోడి మరే సినిమా కూడా మెప్పించలేదు.

ఐతే కామెడీని పక్కన పెట్టి ఈ మధ్య ‘నాంది’ అనే సీరియస్ సినిమా ఒకటి చేశాడు నరేష్. ఆ సినిమా భిన్నంగా అనిపించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది. దాని ఫస్ట్ లుక్, టీజర్ రెండూ కూడా ఆకట్టుకున్నాయి. గత ఆరేడేళ్లలో అల్లరోడి ఏ సినిమాపై కలగని ఆసక్తి ఈ చిత్రంపై కలిగింది. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా రిలీజ్ చేస్తే ప్రయోజనం ఉంటుంది. కానీ టీజర్ తర్వాత సినిమా గురించి చప్పుడే లేదు.

దాన్ని పక్కన పెట్టి తన పాత కామెడీ స్టయిల్లో చేసిన ‘బంగారు బుల్లోడు’ను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. ఈ సినిమాకు చూస్తే మినిమం బజ్ కనిపించడం లేదు. ఈ సినిమా మొదలై, పూర్తయి చాలా కాలం అయింది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అల్లరోడి పాత సినిమాల స్టయిల్లోనే కనిపించింది. ఈ టైపు కామెడీలు ఇప్పుడు ఏమాత్రం వర్కవుట్ అవుతాయో అన్న సందేహాలున్నాయి.

పైగా సరైన ప్రమోషన్ కూడా లేకుండా, సంక్రాంతి సినిమాల జోరు కొనసాగుతున్న టైంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీని బదులు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉణ్న ‘నాంది’ని ముందు రిలీజ్ చేసి, తర్వాత ‘బంగారు బుల్లోడు’ను విడుదల చేసి ఉంటే మంచి ఫలితం ఉండదేమో. రిలీజ్ ప్లానింగ్ విషయంలో నరేష్ తప్పటడుగు వేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ స్థితిలో శనివారం విడుదలవుతున్న ‘బంగారు బుల్లోడు’ ఏమాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.