రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్ కపూర్, సాయిపల్లవి తమ శాయశక్తులా ప్రమోషన్లలో పాల్గొంటూ, ఈవెంట్లకు వెళ్తూ, ఇంటర్వ్యూలు ఇస్తున్నా ఏదో మిస్ అవుతోంది. గ్రౌండ్ లెవెల్ లో భీభత్సమైన హైప్ రావడం లేదు. ఢిల్లీలో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలు, సిజెపి పార్టీ ఆందోళనల వల్ల హిందీ మీడియా ఎక్కువగా వాటి మీద ఫోకస్ పెట్టి రామాయణకు తగినంత కవరేజ్ ఇవ్వలేకపోతోంది.

ఇక్కడ రాజమౌళి ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ తీసిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారి పబ్లిసిటీ విషయంలో తమ బలహీనతను బయట పెట్టుకున్నారు. సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల జనాలకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందలేదు. పైగా ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం, పోస్టర్లు అధిక శాతం ఏఐతో చేసిన ఫీలింగ్ కలిగించడం లాంటి కారణాలు అంచనాల బరువుని పెంచలేకపోయాయి. దీని వల్లే ఓపెనింగ్స్ రిస్క్ లో పడ్డాయి.

ఒకవేళ ఇదే రామాయణ మన జక్కన్న తీసి ఉంటే లెక్క వేరుగా ఉండేది. ఇప్పటికే కొన్నివందల సార్లు చూసేసిన కథ కాబట్టి ఇందులో తానేం కొత్తగా చూపించబోతున్నాడో ముందుగానే ప్రేక్షకులను ప్రిపేర్ చేయడానికి తనదైన స్ట్రాటజీని రచించేవారు. మేకింగ్ వీడియోస్ కావొచ్చు, లేదా వినూత్నంగా అనిపించే పోస్టర్స్ అవ్వొచ్చు, లేదా పల్స్ తెలుసుకోవడానికి వదిలే లీక్స్ కావొచ్చు ఏదైతేనేం ప్రతిదీ మీడియాతో పాటు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేసుకుంటారు.

రామాయణ ఇలాంటి ప్రణాళికను మిస్ అవుతోంది. చేతిలో మూడు వారాలు మాత్రమే సమయమున్నా హడావిడి చేయడంలో వెనుకబడుతోంది. నిజానికి ఇంత పెద్ద విజువల్ గ్రాండియర్ వస్తున్నప్పుడు ఎవరూ పోటీకి వచ్చే సాహసం చేయరు. కానీ అన్ని భాషల్లో వేర్వేరు సినిమాలు కాంపిటీషన్ కు రెడీ అవుతున్నాయి. అందుకే అనేది సినిమా తీయడం ఎంత ముఖ్యమో దానికి పబ్లిక్ లో ఎగ్జైట్ మెంట్ కలిగించడం అంతకన్నా ముఖ్యం. ఈ విషయంలో రాజమౌళిని మించినవారు లేరు.