శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా చూస్తామా. అసలు ప్యాన్ ఇండియా మూవీస్ కే ఆ గ్యారెంటీ లేని పరిస్థితిలో ఒక చిన్న చిత్రం వారాల తరబడి కలెక్షన్లు కొల్లగొట్టడం చూసి ట్రేడ్ వర్గాలకు నోట మాట రావడం లేదు. అదేంటో సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళకు బాగా తెలిసే ఉంటుంది. గత నెల ఇరవై ఐదున విడుదలైన ప్రేమద ఊరల్లీ సెన్సేషనల్ సక్సెస్ సాగించి ఇప్పట్లో తగ్గేదేలే తరహాలో కలెక్షన్ల ఊచకోత కొనసాగిస్తోంది.

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన కొన్ని విషయాలున్నాయి. అక్టోబర్ 15 రజనీకాంత్ జైలర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లు దీనికి పెద్ద ఎత్తున స్క్రీన్లు సర్దుబాటు చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్న ప్రేమద ఊరల్లీ తీసేసి దాన్ని వేసేందుకు చాలా మంది ఎగ్జిబిటర్లు ససేమిరా అంటున్నారట. స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని, హౌస్ ఫుల్ బోర్డులు ఉన్న సినిమాని తీసేసి బజ్ తక్కువగా ఉన్న దాన్ని ఎలా వేయమంటారని అడుగుతున్నారట.

ఇప్పటికే ఎనభై కోట్ల మార్కుని దాటేసిన ఈ మూవీ సోమవారం సైతం రెండు లక్షల అరవై వేల బుక్ మై షో టికెట్లు అమ్మడం గమనార్హం. దీని దెబ్బ ఎంతగా ఉందంటే అక్టోబర్ 2 వచ్చిన శివరాజ్ కుమార్ బెయిల్ అంతో ఇంతో కొంచెం యావరేజ్ గా ఉన్నా సరే కాంపిటీషన్ వల్ల వాషౌట్ అయిపోయింది. గణేష్ నటించిన బృందావిహారి ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కావాల్సి ఉండగా ప్రేమద ఊరల్లీ సునామికి భయపడి ఏకంగా నెల రోజు వాయిదా వేసుకుని సైడయ్యింది.

విచిత్రంగా తెలుగు డబ్బింగ్ ప్రేమనే ఊరిలో మన దగ్గర ఆడకపోవడం ఇక్కడ మాట్లాడుకోవాలి. నేటివిటీ, ఇలాంటి ఎమోషన్స్ మనం గతంలోనే చాలా చూసి ఉండటం, కొంచెం సీరియల్ లా అనిపించే నెరేషన్ వెరసి మన ఆడియన్స్ కి ఈ ప్రేమ కం ఫాదర్ సెంటిమెంట్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేకపోతోంది. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందిన ప్రేమద ఊరల్లీ ఎక్కడో మారుమూల థియేటర్లలో ఉన్న డబ్బా థియేటర్లను కూడా నింపడం శాండల్ వుడ్ అరుదుగా చూసే అద్భుతం.