టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. వీటిలో కథానాయకుడు తను కాదు కాబట్టి ఫ్యాన్స్ నెక్స్ట్ ప్రాజెక్టు ఏది ఉంటుందని ఎదురు చూస్తున్నారు. ఫ్లాపులు ఎవరికైనా సహజమే కానీ టాక్సిక్ వల్ల యష్ బాగా డిస్టర్బ్ అయినట్టు సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇదిలా ఉండగా యష్ కోసం వారాణసిలో కొంత భాగంతో పోలి ఉన్న ఒక మూవీ ఉండొచ్చని లేటెస్ట్ అప్డేట్.
ఇటీవలే సర్దార్ 2 తో చేదు ఫలితం అందుకున్న దర్శకుడు పీఎస్ మిత్రన్ దగ్గర ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఒక స్క్రిప్ట్ ఉంది. ఇది ఆయన డ్రీం ప్రాజెక్టు. హాలీవుడ్ క్లాసిక్ ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా తీసుకుని దీన్ని అల్లుకున్నారట. చాలా పెద్ద స్టార్ హీరో అవసరమయ్యే ఈ సినిమాకు బడ్జెట్ కూడా వందల కోట్లలోనే ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. అందుకే యష్ ని ఎంచుకున్నారని, తను కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మాతగా ఉండొచ్చని వినికిడి.
దీనికి వారణాసికి లింక్ ఏమిటంటే ఈ రెండు ఇండియానా జోన్స్ నుంచి ఇన్స్ పిరేషన్ తీసుకున్నావే. మహేష్ బాబు మూవీలో మనం చూస్తున్న జంతువులు, ఆఫ్రికా అడవులు వగైరాలు పైన చెప్పిన హాలీవుడ్ మూవీ ఆధారంగా అల్లుకున్నవే. ఈ విషయం స్వయంగా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దానికి తోడుగా రామాయణం, కుంభకర్ణుడు, నిధుల వేట, శివుడి ఎలిమెంట్ వగైరాలు ఉంటాయన్న మాట. మిత్రన్ కథలో మాత్రం కేవలం ఫారెస్ట్ అడ్వెంచర్ ఉంటుందని టాక్.
ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు కానీ అంతా ఓకే అనుకున్న తర్వాత అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు. సర్దార్ 2 దారుణంగా దెబ్బ తిన్నా మిత్రన్ కి ఇంత మంచి ఛాన్స్ రావడం లక్కీనే. టాక్సిక్ విషయంలో అతి నమ్మకంతో ఏదో ఇంగ్లీష్ సినిమా తీస్తున్న రేంజ్ లో ఫీలైన యష్ కు దాని ఫలితం పెద్ద గుణపాఠమే నేర్పింది. కెజిఎఫ్ హీరోకు వాస్తవాలు చూపించింది. సో మిత్రన్ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటాడో లేక టాక్సిక్ లాగా ఎక్కువ సమయం గడుపుతాడో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates