తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో తన తమ్ముడిని చిరు ఎక్కువగా పొగడడు. కానీ సందర్భానుసారం తమ్ముడి ఘనతల గురించి ఉప్పొంగిపోయి మాట్లాడుతుంటాడు. సినిమాల్లోనే తన వారసత్వాన్ని నిలబెట్టినందుకు పవన్‌ను చూసి చిరు ఒకప్పుడు ఎంతో గర్వించాడు. ఇక రాజకీయాల్లో తనను మించి ఎదగడం ఆయనకు అమితానందాన్ని కలిగించే విషయం.
ఐతే పవన్ రాజకీయం గురించి చిరు ఎప్పుడో కానీ మాట్లాడడు. ఐతే ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది. రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ తీసుకొస్తున్న మార్పుల గురించి మాట్లాడారు. ముఖ్యంగా పవన్ ఆధ్వర్యంలోని పంజాయితీ రాజ్ శాఖలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన కొనియాడారు.
‘‘నేను ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయాయి. ఇక్కడ పరిపాలన ఎలా ఉంది.. రోడ్లు ఎలా ఉన్నాయి అని ఇందాక ప్రయాణంలో అడుగుతుంటే.. గతంలో కంటే చాలా మార్పులు వచ్చాయని.. మంచి రోడ్లు వచ్చాయని చెప్పారు. పాలన చాలా బాగుందని అన్నారు. మంచి రోడ్లు వస్తున్నాయని తెలిసింది. ఎక్కడో 25- 23వ స్థానంలో ఉండే పంచాయితీరాజ్ శాఖ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ స్థానంలోకి వచ్చిందని చెప్పారు.
నెమ్మది నెమ్మదిగా అన్నీ ఎంతో బాగుపడుతున్నాయి. ఇలాగే అన్నీ మెరుగుపడుతూ, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ప్రజలకు మరింత మేలు జరగాలని.. రాష్ట్రం భవిష్యత్తులో మరింతగా పథం వైపు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని చిరు వ్యాఖ్యానించారు. ఆరోగ్య మంత్రిగా సత్యప్రసాద్ చేస్తున్న మంచి పనులను కూడా ఆయన కొనియాడారు. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పనితీరును చిరు ఇలా బహిరంగంగా కొనియాడడం ఇదే తొలిసారి. జనాల నుంచి ఎన్ని ప్రశంసలు లభించినా.. తన అన్నయ్య నుంచి ఇలాంటి కితాబు రావడం పవన్‌కే కాదు, అభిమానులకూ అమితానందాన్ని కలిగించేదే.
Gulte Telugu Telugu Political and Movie News Updates