కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం ఆసక్తి రేపుతోంది. స్థాయి పరంగా ఇద్దరికీ వందల కిలోమీటర్ల వ్యత్యాసమున్నా కంటెంట్లు మాత్రమే గెలుస్తున్న బాక్సాఫీస్ ట్రెండ్ లో ఫలానా స్టార్ కే విజయం దక్కుతుందని గ్యారెంటీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే గత సెంటిమెంట్లకు సంబంధించిన రెఫరెన్సులు మూవీ లవర్స్ మధ్య ఆసక్తి రేపుతున్నాయి. ఎవరిది గెలుపనే దాని మీద చర్చలకు దారి తీస్తున్నాయి.
రజని, విజయ్ మొదటిసారి తలపడింది పది సంవత్సరాల క్రితం 2016లో. పెళ్లి చూపులు, కబాలి కేవలం వారం గ్యాప్ లో పరస్పరం ఎదురయ్యాయి. రజిని ఎలాంటి ఫలితం అందుకున్నారో తెలిసిందే. భారీ అంచనాల మధ్య కబాలి జనాలను నిరాశపరిచింది. అయితే ఇంకా ఆడియన్స్ కి పెద్దగా పరిచయమే లేని విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎలాంటి హైప్ లేకుండా వచ్చిన పెళ్లి చూపులు క్లీన్ హిట్ అందుకుంది. తనకు ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ లో ఒక గుర్తింపుని తీసుకొచ్చింది.
తర్వాత 2018లో టాక్సీవాలా, 2.0 ఎదురుపడ్డాయి. ముందు రజనీకాంత్ వస్తే తర్వాత పది రోజుల గ్యాప్ తో దేవరకొండ దిగాడు. ఓపెనింగ్స్ లో తలైవా దుమ్మురేపినా ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకోలేదు. టాక్ పరంగా మొదటి భాగం దరిదాపుల్లోకి వెళ్ళలేదు. అయితే పైరసీ బారిన పడి ప్రింట్ బయటికి వచ్చిన టాక్సివాలా అనూహ్యంగా సక్సెసయ్యింది. నష్టాల పాలవుతామని భావించిన నిర్మాతలను మంచి లాభాలతో గట్టెక్కించింది. తర్వాత మళ్ళీ ఈ ఇద్దరూ తలపడిన దాఖలాలు లేవు.
ఈసారి కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రణబాలిని ఏపీ తెలంగాణలో రెగ్యులర్ టికెట్ రేట్లకే రిలీజ్ చేస్తున్నారు. ఎలాంటి పెంపు ఉండదు. జైలర్ 2 డబ్బింగ్ అయినా సరే ఏపీ ప్రభుత్వం హైక్స్ కి అనుమతులు ఇచ్చేసింది. ఈ అంశం ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. అలాని రజని మేనియాని తక్కువంచనా వేయలేం. యావరేజ్ ఉన్నా అనిరుద్ సహాయంతో బండి లాగేస్తాడు. మరి రణబాలి చేయబోయే ఈ మహారణంలో ఎలాంటి ఆయుధాలతో గెలుస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates