రావిపూడిని సైడ్ చేసిన లేడీస్

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన సినిమాలను సూపర్ సక్సెస్ చేయడం ఒకెత్తయితే.. ఆ సినిమాలు మొదలైన దగ్గర్నుంచి వాటిని ప్రమోట్ చేయడం ఇంకో ఎత్తు. ఒక సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచి స్వయంగా తనే భాగం అవుతూ ఫన్నీ ప్రోమోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదలడం ద్వారా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లిపోతుంటాడు. వీటిలో తన మీద తాను పంచులు వేసుకోవడానికి కూడా వెనుకాడడు. తన కొత్త చిత్రం ‘జనవరి 12 విడుదల’కు సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఫన్నీ ప్రోమోలతో అనిల్ తన మార్కు చూపించాడు.

ఇప్పుడు ఈ సినిమా పాటల ప్రయాణం మొదలవుతున్న నేపథ్యంలో అనిల్ ఒక హిలేరియస్ ప్రోమోతో అదరగొట్టాడు. ఇందుకోసం అతను మణిరత్నం ఐకానిక్ మూవీ ‘దళపతి’ నుంచి రెఫరెన్స్ తీసుకోవడం విశేషం. తన పెళ్లి మరో వ్యక్తితో సెటిలైందని శోభన చెప్పే సన్నివేశంలో నేనా నిన్ను ప్రేమించింది.. వెళ్లు వెళ్లి చేసుకోపో అంటూ ఆవేశంగా రజినీ డైలాగ్ చెప్పే సన్నివేశం నుంచి ఇన్‌స్పైర్ అయి.. ‘జనవరి 12 విడుదల’లో ఫస్ట్ సాంగ్ అనౌన్స్‌మెంట్ ప్రోమోను కట్ చేశాడు అనిల్.

సినిమా ప్రమోషన్ అనగానే ఆర్టిస్టుల కంటే ముందు అనిల్ రెడీ అయిపోతాడని సోషల్ మీడియాలో అతడిపై పంచులు వేస్తుంటారు. ఐతే ఈ విషయంలో తన మీద తనే కౌంటర్ వేసుకున్నాడు అనిల్. ‘జనవరి 12 విడుదల’లో సెకండ్ హీరోయిన్ కృతి శెట్టి వచ్చి కీర్తితో కలిసి రీల్ చేసుకుంటా అనడం.. దానికి హర్టయి అనిల్ వెళ్లు, వెళ్లి తనతోనే చేసుకోపో అని దళపతి స్టయిల్లో అరవడం.. ఆపై కీర్తి ‘‘ప్రమోషన్ అంటే చాలు వచ్చేస్తాడు’’ అంటూ అనిల్ మీద పంచ్ వేసి, ఇది అమ్మాయిల పాట అతనవసరం లేదన్నట్లు మాట్లాడి కృతితో కలిసి స్టెప్ వేయడం.. ఇలా ఫన్నీగా సాగింది ప్రోమో. 

అనిల్‌ను లేడీస్ ఇద్దరూ సైడ్ చేసే వీడియోలో కూడా అతనే హైలైట్ కావడం ఈ ప్రోమో స్పెషాలిటీ. మరి ఇంత ప్రోమో కట్ చేసిన పాట ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరం. ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్‌తో అతను చేస్తున్న తొలి చిత్రమిది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్న ‘జనవరి 12 విడుదల’ సంక్రాంతి కానుకగా జనవరి 12నే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.