‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాకు సెన్సార్ బోర్డు దగ్గర ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ నక్సలిజం చుట్టూ తిరగడం వల్ల కావచ్చు.. ఇందులో కొన్ని మూవీ రెఫరెన్సులతో పంచులు వేయడం వల్ల కావచ్చు.. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం జరిగింది.

ఢిల్లీలో రివైజింగ్ కమిటీ వరకు వెళ్లి సినిమాను బయటికి తీసుకొచ్చామని రిలీజ్ ముంగిట ఈ చిత్ర ప్రెజెంటర్ కోన వెంకట్ తెలిపారు. ఐతే ఈ ప్రాసెస్‌లో మెగాస్టార్ చిరంజీవి సైతం సాయపడ్డట్లు తాజాగా జరిగిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సక్సెస్ ప్రెస్ మీట్లో కోన వెల్లడించారు. సెన్సార్ క్లియరెన్స్ రావడంలో చిరు చేసిన సాయం గురించి ఆయన బయటపెట్టారు.

‘కామ్రేడ్ కళ్యాణ్’కు రిలీజ్ ముంగిట ఎదురైన ఇబ్బందుల గురించి కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘‘ఏ సినిమాకు అయినా త్యాగాలు చేయకుండా ఏమీ జరగదు. ఈ సినిమాకు అతి పెద్ద సాయం చేసింది ఎవరంటే.. మెగాస్టార్. సరైన సమయం వచ్చినపుడు ఈ విషయం చెబుదామని వెయిట్ చేశా. మా సినిమాకు సెన్సార్ దగ్గర ఇబ్బంది ఎదురవుతోందని తెలుసుకుని.. ఇది కామెడీ సినిమా, దీన్నెందుకు ఇంతగా శల్య పరీక్ష చేస్తున్నారు అని ఒక పెద్ద మనిషిలా ఆయన ఒక మాట చెప్పడం వల్ల మా సినిమా స్మూత్‌గా సెన్సార్ బోర్డు దగ్గర్నుంచి బయటికి వచ్చింది’’ అని వెల్లడించారు.

నిజానికి ఈ సినిమాలో మెగాస్టార్ డిజాస్టర్ ఫిలిం ‘ఆచార్య’ మీద సెటైర్లు ఉంటాయి. ఆ విషయంలో చిరు ఏమైనా ఫీలై ఉంటారేమో అని చాలామంది అనుకుంటుండగా.. చిరు ముందే ఆ జోక్ గురించి తెలుసుకుని సరదాగా తీసుకున్నారని, అది సినిమాలో హైలైట్ అవుతుందని కూడా చెప్పాడని శ్రీవిష్ణు వెల్లడించడం గమనార్హం. ఆ డైలాగ్‌‌తో ఇబ్బంది లేదని చిరు చెప్పాకే సినిమాలో దాన్ని ఉంచిందట చిత్ర బృందం.