అదుర్స్ కొనసాగింపు కుదరదని తెలిసినా

కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని తొందరపడితే చేతులు కాలతాయి. అసలు వాటి ప్రస్తావన కూడా అవసరం లేనిదే. తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో నిర్మాత కం రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల తర్వాత ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశాడని, ఈ వీకెండ్ లో కలుస్తానని, అప్పుడు అదుర్స్ 2 గురించి అడుగుతానని ఒక జర్నలిస్టు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇదే క్వశ్చన్ గతంలో దర్శకుడు వివి వినాయక్ కు ఎదురైనప్పుడు ఆయన ఓపెన్ గా సాధ్యం కాదని చెప్పేశారు. తారక్ ఇమేజ్ మారిపోయిందని, ఇప్పుడు అదుర్స్ జానర్ లో సీక్వెల్ చేయడం కష్టమని కుండ బద్దలు కొట్టారు. అంతే తప్ప చూస్తాను అడుగుతాను అనలేదు. ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆలోచించారు కాబట్టి. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో అదుర్స్ రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటుంది కానీ దానర్థం జనాలు పార్ట్ కోసం ఎదురు చూస్తున్నారని కాదు.

గతంలో బ్యాండ్ మేళం ప్రమోషన్స్ టైంలోనూ కోన వెంకట్ ఈ అదుర్స్ 2 ప్రస్తావన తీసుకొచ్చారు. అయినా ఎప్పుడో పదిహేనేళ్ల క్రితం వచ్చిన హిట్ మూవీకి ఇప్పుడు కంటిన్యుయేషన్ చేయడం కష్టం. అందులోనూ వినాయక్ అన్నట్టు ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. డ్రాగన్ తో తన స్థాయి మరింత పెరుగుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాంటప్పుడు చారి అంటూ పిలక పెట్టుకుని కామెడీ చేయడం కష్టం కాదు అసలు రాయడమే పెద్ద టాస్క్.

ఈ మధ్య ఏఐ వాడి బ్రహ్మానందం, నయనతార వీడియోలు సృష్టించి కొందరు భలే కామెడీ చేస్తున్నారు. వాటికొచ్చే రెస్పాన్స్ ఆధారంగా అదుర్స్ 2 రాసుకోవడం పెద్ద ప్రయాస. కామ్రేడ్ కళ్యాణ్ లో ఆ స్థాయి ఎంటర్ టైన్మెంట్ ఉందనే స్థాయిలో కోన వెంకట్ హామీ ఇవ్వడం చూస్తుంటే శ్రీవిష్ణుకి రెండు ఫ్లాపుల తర్వాత మరో హిట్టు దక్కుతుందేమో చూడాలి. ఆదర్శ కుటుంబం తప్పుకోవడంతో పెద్ద పోటీ తగ్గిపోయి కామ్రేడ్ కళ్యాణ్ కి భారీ అడ్వాంటేజ్ దక్కనుంది. ఎలా వాడుకుంటారో చూడాలి.