ఇకపై మొహమాటలు లేవంటున్న నాని

న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక శాతం ప్రాంతాల్లో నష్టాలు చవి చూడటం ఎవరూ కాదనలేని వాస్తవం. కంచుకోటగా భావించే ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈసారి నో చెప్పేశారు. దీన్ని బట్టే సినిమా రిజల్ట్ ఏంటనేది మొదటి వారంలోనే అర్థమైపోయింది. దీంతో నాని స్వీయ విశ్లేషణలో పడ్డాడు. ఇకపై ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మీద 70 శాతం దాకా సమయం కేటాయిస్తానని కుండ బద్దలు కొట్టి చెబుతున్నాడు.

ఇంత మార్పు నానిలో రావడానికి కారణం లేకపోలేదు. పనులు చాలా ఎక్కువగా ఉండటం వల్లే ప్యారడైజ్ ట్రైలర్ కట్ చేయడానికి టీమ్ దగ్గర సమయం లేకపోయింది. ఒకవేళ అది చేసి ఉంటే కంటెంట్ గురించి ఆడియన్స్ ముందే ప్రిపేరయ్యి వచ్చే వాళ్ళని ఇండస్ట్రీలో చాలా మంది అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఎడిటింగ్ హడావిడిగా జరగడం, అనిరుధ్ రీ రికార్డింగ్ కి తగినంత సమయం దక్కపోవడం లాంటి ఎన్నో అంశాలు ఫైనల్ అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపించాయి.

అందుకే నాని ఇకపై అలెర్ట్ ఉంటానని చెబుతున్నాడు. హీరోల ప్రమేయం కేవలం షూటింగ్ వరకే పరిమితం కాకూడదనేది మంచి విషయమే. ఎందుకంటే దర్శకుడి ఇబ్బందులు ఒక్కోసారి అతని స్థాయికి మించి వచ్చినప్పుడు హీరోనే అండగా నిలవాలి. దగ్గరుండి చూసుకోవాలి. దాని వల్ల తప్పొప్పులు తెలియడంతో పాటు క్వాలిటీ మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. స్క్రిప్ట్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే న్యాచురల్ స్టార్ నాని టైం సమస్య వల్ల ప్యారడైజ్ మీద పూర్తి ఫోకస్ పెట్టలేదు.

ఒకవేళ ప్యారడైజ్ కనక పూర్తి అంచనాలు అందుకుని ఉంటే నాని కెరీర్ లోనే కాదు టాలీవుడ్ టాప్ 10 గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచే ఛాన్స్ దక్కించుకునేది. ఎంతలేదన్నా మూడు వందల కోట్ల మార్కుని ఈజీగా దాటేది. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయినా నానికి తన మార్కెట్ ఎంత పెరిగిందో, ప్రేక్షకులు తన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో అర్థమయ్యింది. అందుకే నెక్స్ట్ బ్లడీ రోమియోతో పాటు తర్వాత చేయబోయే ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ మీద చాలా శ్రద్ధ వహించబోతున్నాడు.