దర్శకుడు పూరి జగన్నాథ్ కొత్త సినిమా ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ విడుదల వ్యవహారం ఇంకా తేలలేదు. నిన్న రిలీజ్ చేసిన జరీనా వహాబ్ టీజర్ లో ఎక్కడా దాని ప్రస్తావన లేదు. ఇంతకు ముందు టబు పాత్రని పరిచయం చేస్తూ ఒక వీడియో, దానికి పూర్వం అసలు టీజర్ ఒకటి ప్రేక్షకులకు ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ థియేటర్లకు ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఓటిటి డీల్ వల్లనా లేక ఇంకేదైనా కారణాలు ఉన్నాయానే దాని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇటీవలే హనుమాన్ నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డబుల్ ఇస్మార్ట్ విషయంలో పూరి, చార్మీ వల్ల తాము నష్టపోయిన వైనాన్ని వివరించడం సోషల్ మీడియాలో వైరలయ్యింది. ఆ నష్టాల తాలూకు వివాదాలు పూర్తిగా సమిసిపోలేదని అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. ఆఖరికి పోకిరి రీ రిలీజ్ కూడా ఈ వ్యవహారాల వల్లే ఆగిపోతోందని ఇన్ సైడ్ టాక్. ఎందుకంటే పోకిరిలో వైష్ణో అకాడమీ తరఫున పూరి జగన్నాథ్ కూడా నిర్మాతల్లో ఒకరు కాబట్టి.
ఇవన్నీ క్లియర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఓటిటి డీల్ అనుకున్నంత రాకపోవడం కూడా మరో రీజన్ గా చెప్పుకుంటున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన స్లమ్ డాగ్ లో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా ఒక ముఖ్యమైన క్యారెక్టర్ టబు చేస్తోంది. దునియా విజయ్ మెయిన్ విలన్. ఇంత క్యాస్టింగ్ సెటప్ పెట్టుకుని కూడా సినిమాని సరైన టైంకి బయటికి తేకపోవడం పూరి అభిమానులను కలవరపరుస్తోంది. ఈ మూవీ ఆయనకు కంబ్యాక్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఇప్పటికైతే అక్టోబర్ నుంచి సంక్రాంతి దాకా స్లాట్స్ అన్నీ దాదాపుగా ఖాళీ అయ్యాయి. వచ్చే నెల చివరి వారం ఆప్షన్ ఉంది కానీ పూరి అప్పటికంతా సంసిద్ధంగా ఉంటారా లేదానేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. లేట్ చేసే కొద్దీ బజ్ అంతకంతా తగ్గిపోయే రిస్క్ ఉంది. ఎలాగూ తమిళంలోనూ బిజినెస్ అవుతుంది కాబట్టి వీలైనంత త్వరగా లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటే బాగుంటుంది. బయట ఈవెంట్లలో పూరి కనిపించి ఎంత కాలమయ్యిందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates
