మన తెలుగు సినిమాలు ఏపీ తెలంగాణలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా హిందీ లో థియేట్రికల్ గా వర్కౌట్ చేసిన దాఖలాలు తక్కువ. రాజమౌళి, సుకుమార్ మాత్రమే దీనికి మినహాయింపుగా నిలుస్తారు. పెద్ది లాంటివి పెద్ద ఎత్తున ముంబై ఢిల్లీ వెళ్లి ప్రమోషన్లు చేస్తే బాలీవుడ్ జనాలు లైట్ తీసుకున్నారు. సరే ఓటిటిలో వచ్చాక ఎగబడి చూస్తారేమో అనుకుంటే అదీ జరగలేదు. అయితే ఇరుముడికి అలాంటి చేదు ఫలితం దక్కలేదు. ఓటిటి స్ట్రీమింగ్ మొదలయ్యాక పాజిటివ్ టాక్స్ కనిపిస్తున్నాయి.
డబ్బింగ్ వెర్షన్ల పుణ్యమాని భాషతో సంబంధం లేకుండా ఇరుముడి లాంటి సినిమాలు ఈజీగా అన్ని వర్గాలకు చేరిపోతున్నాయి. పాప సెంటిమెంట్, ఇరుముడి కాన్సెప్ట్ ని దర్శకుడు శివ నిర్వాణ కథలో మేళవించిన తీరు, రెండు అయ్యప్ప పాటలు, క్లైమాక్స్ వెరసి నార్త్ ఆడియన్స్ కి ఇరుముడి బాగా నచ్చేసింది. సోషల్ మీడియాలో ఒక వర్గం తెలుగు యువత సినిమాలో లాజిక్స్ ని వెతుకుతూ విమర్శించే పనిలో ఉండగా దానికి రివర్స్ లో ఉత్తరాది నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
కేవలం 28 రోజుల థియేటర్ విండోతో ఇరుముడి ఓటిటికి రావడం వల్ల మంచి ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. కొత్త కంటెంట్ కావడంతో చూసేవాళ్ల సంఖ్య భారీగా ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ అసలే దీని వ్యూస్ మీద గంపెడాశలు పెట్టుకుంది. థియేటర్ రన్ దృష్టిలో పెట్టుకుని ఒక వారం వాయిదా వేయమని ఆన్ లైన్ వేదికగా అభిమానులు కోరినా వినలేదు. ఒప్పందం ప్రకారం ఒక్క రోజు ఆలస్యం లేకుండా చెప్పిన తేదీకి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ మొదలుపెట్టేసింది.
రవితేజకు కొంత కాలంగా ఉన్న లోటు హిందీ ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఇవ్వకపోవడం వల్ల రీచ్ రాకపోవడం. కిక్, విక్రమార్కుడు లాంటి బ్లాక్ బస్టర్లు అక్కడ స్టార్ హీరోలు రీమేక్ చేసుకోవడం వల్ల మాస్ మహారాజా రీచ్ పరిమితంగా ఉండిపోయింది. ఇప్పుడీ ఇరుముడి కారణంగా ఇమేజ్, మార్కెట్ పెరిగితే తర్వాతి సినిమాలకు అక్కడి నుంచి బిజినెస్ ఆశించవచ్చు. ఆల్రెడీ టాప్ ట్రెండింగ్ లో వచ్చేసిన ఇరుముడి వ్యూస్ పరంగా నమోదు చేసే రికార్డులు ఏ స్థాయిలో ఉంటాయో.
Gulte Telugu Telugu Political and Movie News Updates