ఈ రోజుల్లో అభిమానులను పట్టించుకుని, వాళ్లను మేనేజ్ చేయకపోతే స్టార్ హీరోల ఇమేజ్ పెరగడం, మార్కెట్ విస్తరించడం కష్టమవుతుంది. స్టార్‌గా ఎదిగే కొద్దీ అభిమానులను ఎంగేజ్ చేయడానికి ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిందే. అందుకే చాలామంది స్టార్లు తమ సినిమాల విడుదలకు ముందు ఫ్యాన్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు.
అల్లు అర్జున్ లాంటి హీరోలైతే.. సినిమాల రిలీజ్‌తో సంబంధం లేకుండా అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. మిగతా స్టార్లు కూడా ఈ ట్రెండును ఫాలో అవక తప్పట్లేదు.
తాజాగా నేచురల్ స్టార్ నాని కూడా తన అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ గురువారం తన కెరీర్లోనే అతి పెద్ద సినిమా అయిన ‘ది ప్యారడైజ్’ రిలీజవుతుండగా.. దాని ముంగిట ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లో సోమవారం చాలా పెద్ద స్థాయిలో ఈ ఈవెంట్ నిర్వహించారు.
ఒకేసారి ఏకంగా పదివేల మంది అభిమానులను కలిశాడు నాని. ఫ్యాన్ మీట్ అంటే సింపుల్‌గా అభిమానులను గ్యాదర్ చేసి చిన్న స్పీచ్ ఇచ్చి వెళ్లిపోవడం కాదు. వచ్చిన పది వేల మందికీ మంచి భోజనం పెట్టి.. వాళ్లందరికీ వ్యక్తిగతంగా సెల్ఫీ ఫొటో ఇచ్చి మరీ పంపిస్తున్నాడు నాని.
ఈ సందర్భంగా నేచురల్ స్టార్ మాట్లాడుతూ.. ‘‘మీరు నన్ను ఫొటో అడగడం కాదు, మిమ్మల్నే నేను ఫొటో అడుగుతున్నా.. నాతో ఫొటో దిగుతారా? ఈ ఫొటో మీరు కాదు, నేను భద్రంగా దాచుకుంటా’’ అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించడంతో అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు.
స్పీచ్ తర్వాత అభిమానులందరికీ ఫుడ్డు పెట్టించి వారితో ఫొటోలు దిగడం మొదలుపెట్టాడు నాని. ఈ రోజు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని భావిస్తున్నారు. మరీ పదివేలమందికి సెల్ఫీ ఇవ్వాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఎనర్జీ ఉండాలి. అభిమానుల మీద అమితమైన ప్రేమా ఉండాలి. ఈ కార్యక్రమం చేస్తున్న నానిపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates