పార్టీ పెట్టేశారు ఓకే… అజిత్ రావడమే ఆలస్యం

సినిమా హీరోలు రాజకీయ పార్టీలు పెట్టడం తమిళనాడు లో ఎప్పటి నుంచో చూస్తున్నదే. ఈసారి దానికి భిన్నంగా అభిమానులు పార్టీ పెట్టేశారు. ప్రముఖ తమిళనాడు స్టార్ అజిత్ అభిమానులు తమిళ మక్కల్ కలగం (టీఎంకే ) పేరుతో పార్టీ పెట్టినట్లు ప్రకటించారు. పార్టీ జెండా సైతం ఆవిష్కరించారు. కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు.

తమ అభిమాన నటుడి కోసం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా వుంచి మిగిలిన పదువులను ఎన్నుకున్నారు. హీరో అజిత్ ఇప్పటికైనా రాజకీయాల్లోకి రావాలని అభిమానులు విజ్ఞప్తి చేశారు. ఆయన మాత్రం నేను రాజకీయాలకు దూరం అంటూ ఇప్పటికే ప్రకటించి వున్నారు. అయితేనేం అజిత్ రావాల్సిందేనంటూ అభిమానులు పట్టుబడుతున్నారు.

కల్లకుర్చీ జిల్లా ఉళ్లుందురు పేటలో అజిత్ అభిమాన సంఘాలన్నీ కలిసి టీఎంకే పార్టీ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అభిమానులంతా కలిసి పార్టీ పెట్టాం, మా విన్నపం మేరకు అజిత్ సార్ మనసు మార్చుకోవాలి. రాజకీయాలలోకి రావాలని అభిమానులు మీడియా ముందు విజ్ఞప్తి చేశారు. అయితే పార్టీ విషయం గురించి అజిత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆయన ప్రశాంతంగా షూటింగులో వున్నట్లు చెబుతున్నారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా కొన్ని రోజులు పార్టీ పెట్టేందుకు మల్లగుల్లాలు పడ్డారు. అభిమానుల ఒత్తిడి తాళలేక హిమాలయాలకు వెళ్లిపోయారు. పార్టీ పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు అజిత్ వంతు వచ్చినట్లుంది.

తమిళనాడు రాజకీయాలు విలక్షణంగా వుంటాయి. రాజకీయాలు, సినిమాలు కలగాపులగమై వుంటాయి. అభిమానులే కార్యకర్తల అవతారం ఎత్తుతారు. ఎంజీఆర్, కరుణానిధి,జయలలిత, ఉదయానిధి, కమల్ హాసన్, తాజాగా ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ వరకు వెండితెర నుంచి రాజకీయాంగేట్రం చేసిన వాళ్ళే. కొందరు ముఖ్యమంత్రులయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. విజయకాంత్ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపింది కానీ కమల్ హాసన్ పార్టీ పూర్తిగా విఫలమైంది.

ఇటీవల విజయ్ టీవీకే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడంతో పలువురు సినీ నటులు రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్ పార్టీ పెడతారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు అజిత్ అభిమానులు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా పార్టీ పెట్టేశారు. మున్ముందు ద్రవిడ పార్టీలు పూర్తిగా మాయమైపోయి తమిళ్ సినిమా పార్టీలు మాత్రమే పోటీలో వుండే పరిస్థితులు కనబడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.