థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ ఎలా కళకళలాడిపోతోందో తెలిసిందే. థియేటర్లు ఆకర్షణీయంగా ఉంటే.. మంచి సినిమాలు పడితే.. ఆక్యుపెన్సీలకు ఢోకా ఉండదని ఇటీవల చాలా సినిమాలు రుజువు చేశాయి.
మంచి సినిమా వచ్చిందంటే టాప్ క్లాస్ స్క్రీన్లను ఎంచుకుని మరీ అక్కడికే వెళ్లి జనం సినిమా చూస్తున్నారు. అందుకే హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక సిటీలు, టౌన్లలో పాతబడ్డ సింగిల్ స్క్రీన్లను రెనొవేట్ చేసి ఆకర్షణీయంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. సింగిల్ స్క్రీన్లను అధునాతనంగా మారిస్తే.. మల్టీప్లెక్సులు కూడా వాటి ముందు దిగదుడుపే అని హైదరాబాద్ బాలానగర్‌లోని మైత్రి విమల్ లాంటి థియేటర్లను చూస్తే అర్థమవుతోంది. అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోని బెస్ట్ సింగిల్ స్క్రీన్ అనడంలో మరో మాట లేదు.
విమల్ థియేటర్‌ను టాప్ క్లాస్ స్క్రీన్‌గా మార్చిన మైత్రి సంస్థే.. దిల్‌సుఖ్‌నగర్‌లోని శివ-గంగ థియేటర్లను లీజ్‌కు తీసుకుంది. ముందుగా గంగ థియేటర్‌ను రెనొవేట్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దింది. విమల్ థియేటర్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే బెటర్‌గా ఈ స్క్రీన్‌ను రెడీ చేసింది. 66*29 అడుగుల స్క్రీన్, 4కే క్రిస్టీ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ 64 ఛానెల్ సౌండ్.. ఇలా అధునాతన టెక్నాలజీతో ఈ థియేటర్‌ను తీర్చిదిద్దింది.
భారీ ఆడిటోరియం ఉన్న ఈ థియేటర్లో ఇంటీరియర్ సైతం అదిరిపోయింది. ఈ శుక్రవారమే మైత్రి గంగ థియేటర్ లాంచ్ కాబోతోంది. ఈ వారం రిలీజయ్యే ఏదో ఒక చిన్న సినిమాను ట్రయల్‌లాగా నడిపించనున్నారు. వచ్చే వారం ‘ది ప్యారడైజ్’ మూవీతో గంగ థియేటర్లో అసలైన హంగామా చూడబోతున్నాం. ఈ థియేటర్ ఓపెన్ అయ్యాక దీనికి అనుబంధంగా ఉన్న శివ థియేటర్‌ను కూడా రెనొవేట్ చేయబోతోంది మైత్రి సంస్థ.
Gulte Telugu Telugu Political and Movie News Updates