‘బ్రేకింగ్ బ్యాడ్’తో ‘జైలర్‌’కేం పని?

అటు ఇటుగా ఇంకో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘జైలర్-2’ సినిమా. 2023లో ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన ‘జైలర్’ ఎవ్వరూ ఊహించని విధంగా తమిళంలో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. తర్వాత దానికి సీక్వెల్ మొదలవడంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అయితే అంచనాలకు తగ్గట్లు లేకపోయాయి. దీంతో రిలీజ్ ముంగిట హైప్ తగ్గింది.

కానీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. హీరో ఎలివేషన్లలో, అలాగే ఎంటర్టైన్మెంట్ విషయంలో అతను మ్యాజిక్ చేస్తాడని రజినీ అభిమానులు ఆశిస్తున్నారు. రజినీ హీరోయిజం పండితే.. అనిరుధ్ బీజీఎం కూడా బాగా కుదిరితే.. సినిమా పైసా వసూల్‌గా మారిపోతుందని భావిస్తున్నారు.

‘జైలర్-2’ కథేమీ అంత కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం లేదు కానీ.. ఇందులో పాత్రలు మాత్రం క్యూరియాసిటీ పెంచుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటైన ‘బ్రేకింగ్ బ్యాడ్’కు సంబంధించిన క్యారెక్టర్ రెఫరెన్సులు ఈ సినిమాలో కనిపిస్తుండడం విశేషం. ఇందులో చక్రాల కుర్చీకి పరిమితమైన మిథున్ చక్రవర్తి పాత్రను చూస్తే ‘బ్రేకింగ్ బ్యాడ్’లో సాలమాంకా పాత్ర గుర్తుకొస్తోంది. విద్యా బాలన్ పాత్ర.. లిడియా అనే మాఫియా లేడీని గుర్తుకు తెస్తోంది. రజినీ పాత్రేమో.. వాల్టర్ వైట్‌ను తలపించేలా ఉంది.

ఇంకా విజువల్స్, కొన్ని షాట్స్‌కు ‘బ్రేకింగ్ బ్యాడ్’ స్ఫూర్తిగా నిలిచినట్లుంది. అంత పాపులర్ సిరీస్ నుంచి స్టోరీ ఏమీ కాపీ కొట్టి ఉండకపోవచ్చు కానీ.. పాత్రలకు రెఫరెన్సులు తీసుకుని ఇంట్రెస్టింగ్‌గా మార్చే ప్రయత్నం చేసినట్లున్నాడు నెల్సన్. లేదంటే తనకు బాగా నచ్చిన సిరీస్‌కు ఒక ట్రిబ్యూట్‌లా ఈ సినిమాలో కొన్ని పాత్రలు పెట్టి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ ‘బ్రేకింగ్ బ్యాడ్’తో పోలిక సినిమాపై క్యూరియాసిటీని అయితే పెంచుతోంది.