కుటుంబాన్ని పోషించుకోలేక‌పోతున్నా.. ఐబొమ్మ ర‌వి ఆవేద‌న‌

ఐ బొమ్మ ర‌వి.. తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు సినిమాల‌ను ఫాలో అయ్యే వాళ్లంద‌రికీ ఈ పేరు ప‌రిచ‌య‌మే. కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాల‌ను పైర‌సీ చేస్తూ పెద్ద ఎత్తున ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకున్న ఐబొమ్మ‌ వెబ్ సైట్ వెనుక ఉన్న‌ది ఎవ‌రో చాలా ఏళ్ల పాటు ఎవ‌రికీ తెలియ‌లేదు. ఆ సైట్‌ను న‌డిపిస్తున్న‌ది ర‌వి అనే వ్య‌క్తి అని అత‌ణ్ని హైద‌రాబాద్ పోలీసులు గ‌త ఏడాది న‌వంబ‌రులో అరెస్టు చేసిన‌పుడే వెల్ల‌డైంది.

పోలీసుల విచార‌ణ‌లో ర‌వి పైర‌సీ వ్య‌వ‌హారం గురించి అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ సైట్ ద్వారా రూ.20 కోట్ల‌కు పైగానే అత‌ను వెన‌కేసిన‌ట్లు వెల్ల‌డైంది. ర‌విపై అనేక సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు కావ‌డంతో అత‌ను జైలు పాల‌య్యాడు. బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా ఫ‌లితం లేక‌పోయింది. జ‌నం నెమ్మ‌దిగా అత‌ణ్ని మ‌రిచిపోతున్న స‌మ‌యంలో ఇప్ప‌డు ర‌వి మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాడు.

ర‌వి అరెస్ట్ అయ్యాక అత‌డి బ్యాంకు ఖాతాల‌న్నింటినీ కోర్టు ఫ్రీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఆ ఖాతాల‌ను అన్ ఫ్రీజ్ చేయాలంటూ అత‌ను కోర్టులో పిటిష‌న్ వేశాడు. త‌న డ‌బ్బుల‌న్నీ బ్యాంకు ఖాతాల్లో ఇరుక్కుపోవ‌డంతో తన కుటుంబ పోష‌ణ క‌ష్ట‌మ‌వుతోంద‌ని.. నిత్యావ‌స‌రాల కోసం కూడా త‌న కుటుంబ స‌భ్యులు ఇబ్బంది పడుత‌న్నార‌ని.. అందుకే కొన్ని ఖాతాల‌నైనా పున‌రుద్ధరించాల‌ని అత‌ను కోర్టును కోరాడు.

ఐబొమ్మ ర‌వికి సంబంధించి దాదాపు రూ.3 కోట్ల రూపాయ‌ల మేర బ్యాంకు అకౌంట్ల‌ను కోర్టు సీజ్ చేసిన‌ట్లు సమాచారం. ర‌వి పిటిష‌న్ గురించి మీడియాలో, సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తుంటే.. అత‌డి మీద ఎవ‌రూ జాలి చూపించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సినిమా వాళ్ల శ్ర‌మ‌ను దోచుకుంటూ పైర‌సీ చేసి కోట్లు సంపాదించిన వ్య‌క్తి ఇప్పుడు కుటుంబ పోష‌ణ గురించి బాధ ప‌డ‌డం విడ్డూర‌మ‌ని.. అలా అక్ర‌మంగా సంపాదించిన సొమ్ము కోసం పిటిష‌న్ వేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.