విజ‌య్ సేతుప‌తి.. మ‌రో సంచ‌ల‌నం

భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో మూకీ చిత్రాల‌కు ప్రాధాన్యం త‌క్కువే. టాకీలు రాక‌ముందే మూకీలు తీశారు కానీ.. ఆ త‌ర్వాత సైలెంట్ మూవీస్ పెద్ద‌గా తీసింది లేదు. వాటిలో కూడా ఆక‌ట్టుకున్న‌వి త‌క్కువే. పుష్ప‌క విమానం అన్నింట్లోకి ప్ర‌త్యేకంగా క‌నిపిస్తుంది.

ప్ర‌యోగాలకు పెట్టింది పేరైన సింగీతం శ్రీనివాస‌రావు, క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి చేసిన ఆ అద్భుత చిత్రం.. అప్ప‌ట్లో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. మ‌ళ్లీ ఆ స్థాయి మూకీ సినిమా మరొక‌టి రాలేదు. స్టార్ హీరోలెవ్వరూ కూడా మూకీల జోలికే వెళ్ల‌లేదు. నిశ్శ‌బ్దం సినిమాను మూకీలో చేద్దామ‌నుకున్నార‌ట కానీ.. త‌ర్వాత టాకీలోనే తీశారు. ఐతే ఇప్పుడు విజ‌య్ సేతుప‌తి లాంటి పేరున్న న‌టుడు మూకీ సినిమాకు రెడీ అవ‌డం విశేషం.

విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో గాంధీ టాక్స్ అనే మూకీ సినిమా తెర‌కెక్క‌నుంది. కిషోర్ పాండురంగ్ బెలేక‌ర్ అనే ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్నాడు. తాజాగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. బ్యాగ్రౌండ్ మొత్తం క‌రెన్సీ నోట్ల‌తో నింపేయ‌డాన్ని బట్టి ఇది డ‌బ్బుతో ముడిప‌డ్డ సినిమా అనే విష‌యం అర్థ‌మ‌వుతోంది. మూకీ సినిమాను ఫ‌లానా భాషా చిత్రంగా చెప్ప‌లేం. ఐతే సినిమా తీస్తోంది త‌మిళ ద‌ర్శ‌కుడు, త‌మిళ హీరో.

దేశ‌వ్యాప్తంగా అన్ని చోట్లా సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. మాట‌లు లేకుండా హావ‌భావాలు ప‌లికించాలంటే ఈ త‌రంలో విజ‌య్ సేతుప‌తి లాంటి మేటి న‌టుడే క‌రెక్ట్. సినిమాలో మిగ‌తా కాస్టింగ్ గురించి ఇంకా వెల్ల‌డి కాలేదు. ఈ సినిమా విష‌యంలో విజ‌య్ సేతుప‌తి చాలా ఎగ్జైటెడ్‌గానే ఉన్నాడు. మ‌రి పుష్ప‌క విమానం లాగే గాంధీ టాక్స్ కూడా సంచ‌ల‌నం రేపుతుందేమో చూడాలి.