నన్ను స్నేహితులే మోసం చేశారు-సందీప్ కిషన్

సినీ రంగంలో మాయ మాటలు నమ్మి మోసపోయే వాళ్లకు లెక్కే లేదు. పేరున్న వారి వెంట నమ్మకంగా ఉన్న వాళ్లే మోసం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. పూరి జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఇలా దారుణంగా మోసపోయి రోడ్డు మీదికి వచ్చేశాడు ఓ సందర్భంలో. కానీ తర్వాత ఆయన బలంగానే పుంజుకున్నారు.

తాను కూడా క్లోజ్ ఫ్రెండ్స్‌ను నమ్మి మోస పోయానని అంటున్నాడు యువ కథానాయకుడు సందీప్ కిషన్. గత ఏడాది ‘నిను వీడని నీడను నేనే’ సినిమాకు ముందు సందీప్ కిషన్ కెరీర్ ఎంత దారుణమైన స్థితిలో ఉందో తెలిసిందే. వరుస ఫ్లాపులతో అల్లాడిపోయాడతను. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయానని.. కొందరు క్లోజ్ ఫ్రెండ్సే తనను మోసం చేశారని సందీప్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆ వివరాలు వెల్లడించడానికి అతను ఇష్టపడలేదు.

ఐతే తన తప్పుల నుంచి చాలా పాఠాలు నేర్చుకున్నానని.. ఇండస్ట్రీలో ఎవరు ఎలాంటి వాళ్లో తనకు తెలిసిందని.. తాను అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ప్రొడ్యూస్ చేసిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా మంచి విజయం సాధించి తనను మళ్లీ నిలదొక్కుకునేలా చేసిందని సందీప్ తెలిపాడు. ప్రస్తుతం తాను ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాలో నటిస్తున్నానని.. అది తన కెరీర్లో స్పెషల్ ఫిలిం అవుతుందని సందీప్ చెప్పాడు.

ఇంతకీ ప్రేమ వ్యవహారాల సంగతేంటి అని సందీప్‌ను అడిగితే.. గత ఆరేళ్లలో తాను రెండు రిలేషన్‌షిప్స్‌లో ఉన్నానని.. అవి వర్కవుట్ కాలేదని.. ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టానని అతను చెప్పాడు. ప్రస్తుతం తనకు మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఎంతగానో స్ఫూర్తినిస్తున్నాడని. ‘ట్రాన్స్’ సినిమాలో అతడి నటన అద్భుతమని సందీప్ అన్నాడు. తాను నడుపుతున్న ఫుడ్ బిజినెస్‌ను మున్ముందు మరింతగా విస్తరిస్తానని తెలిపాడు సందీప్.