నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు


నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న ఎంట‌ర్టైన‌ర్ల‌తో కుటుంబ ప్రేక్ష‌కుల‌కు అత‌ను బాగా చేరువ అయ్యాడు. కానీ కొన్నేళ్ల నుంచి నాని ఎక్కువ‌గా మాస్, యాక్ష‌న్ సినిమాలే చేస్తున్నాడు. త‌న ఇమేజ్ పూర్తిగా మారిపోతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా ది ప్యార‌డైజ్ మూవీ ప్రోమోలు చూస్తే.. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఆ సినిమా జోలికి వెళ్ల‌రేమో, ఆ వ‌ర్గం అత‌డికి దూర‌మైపోతారేమో అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే విష‌యాన్ని తన ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తే.. త‌న‌ను ఎంతో ఆద‌రించిన ఆ వ‌ర్గానికి దూర‌మ‌య్యే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చేశాడు.

తాను ఈ మ‌ధ్య ఫ్యామిలీ ఫంక్ష‌న్ల‌కు, ఏదైనా ఈవెంట్ల‌కు హాజ‌రైతే.. బంధువులు, తెలిసిన వాళ్లు తన‌ను మ‌ళ్లీ ఫ్యామిలీ సినిమాల్లో చూడాల‌న్న అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు నాని చెప్పాడు. ద‌స‌రా సినిమా త‌ర్వాత తాను హాయ్ నాన్న చేశాన‌ని.. కానీ త‌ర్వాత అనుకోకుండా వ‌రుస‌గా మాస్, యాక్ష‌న్ సినిమాలు ప‌డ్డాయ‌ని.. ప్యార‌డైజ్ త‌ర్వాత తాను బ్లడీ రోమియో చేయ‌బోతున్నాన‌ని చెప్పాడు.

ఐతే దాని త‌ర్వాత చేయ‌బోయే సినిమా ఏంటో త‌న‌కు తెలుస‌ని, అది ఇంకా అనౌన్స్ చేయ‌లేద‌ని.. ప్ర‌క‌ట‌న వచ్చిన‌పుడు అది ఎలాంటి సినిమా అన్నది అందరికీ క్లారిటీ వస్తుందని, తాను ఫ్యామిలీ ఆడియన్సుకి ఎంత మాత్రం దూరం కానని నాని స్పష్టం చేశాడు. తాను కెరీర్లో ఎప్పుడూ ట్రెండ్ ఫాలో కాలేదని.. ఎప్పటికప్పుడు జానర్స్ మార్చుకుంటూ వెళ్లానని.. ఇప్పుడు కూడా ట్రెండ్ ఫాలో కావట్లేదని నాని చెప్పాడు.

ఇక ప్యారడైజ్ మూవీ ప్రధాన టార్గెట్ తెలుగు ప్రేక్షకులే అని.. పాన్ ఇండియా అనే మాటను అతిగా వాడుతున్నారని నాని అభిప్రాయపడ్డాడు. పాన్ ఇండియా అనే మాటను ఇక ఆపేయాలని నాని సూచించాడు. ప్యారడైజ్ సినిమాలో 1000 మందితో ఫైట్, అండర్ వాటర్ సీక్వెన్స్ ఉంటాయని.. తాను ధరించిన జడ విగ్గు బరువు 6 కిలోలని.. డైరెక్టర్ ఎవరినో కొట్టాడు అని వచ్చిన రూమర్లు ఏవీ నిజం కాదని ఈ సందర్భంగా నేచురల్ స్టార్ క్లారిటీ ఇచ్చాడు