రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట వాస్తవం. పారితోషకం కింద నాకు ఇంత కావాలి అడిగే స్థాయి నుంచి.. నిర్మాతలు ఎంతిస్తే అంతకు ఓకే అనక చెప్పని పరిస్థితికి ఆయన చేరుకున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజైన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు తనకు తానుగా పారితోషకంగా బాగా తగ్గించుకుని చేశాడు రవితేజ. ఆ చిత్రం కూడా ఆశించిన ఫలితాన్నివ్వకపోవడంతో రవితేజకు దిక్కుతోచని పరిస్థితి తలెత్తింది.

ఇలాంటి టైంలోనే ‘ఇరుముడి’ సినిమాను ఒప్పుకుని పారితోషకం పూర్తి స్థాయిలో తీసుకోకుండా రూ.8 కోట్లు డబ్బులు పుచ్చుకుని, దానికి నైజాం రైట్స్ కూడా కలిపి పుచ్చుకున్నాడు. రిలీజ్ ముంగిట ట్రేడ్ అంచనా వేసిన నైజాం రైట్స్ వాల్యూ రూ.7 కోట్లు. ఆ లెక్కన రవితేజ ఈ సినిమాకు రూ.15 కోట్లు తీసుకున్నట్లు అంచనా.

కట్ చేస్తే ‘ఇరుముడి’ అసాధారణ ఫలితాన్నందుకుని నైజాంలో వంద కోట్లకు చేరువగా గ్రాస్, రూ.60 కోట్ల మేర షేర్ రాబట్టే స్థాయికి చేరుకుంది. కమిషన్లు, పబ్లిసిటీ ఖర్చులు పోను రవితేజకు నైజాం రైట్స్ ద్వారా రూ.45 కోట్ల దాకా వర్కవుట్ అవుతున్నట్లు సమాాచారం. ఈ రకంగా ఆయన పారితోషకం ఈ సినిమాకు రూ.53 కోట్లకు చేరుకున్నట్లు అంచనా.

రవితేజ లాంటి మిడ్ రేంజ్ స్టార్‌ ఒక సినిమాకు ఈ స్థాయిలో ఆదాయం అందుకోవడం అనూహ్యం. ఇందులో అతిశయోక్తులేమీ లేవని.. సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలన్నీ నిజమే అని.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఖరారు చేశాడు. ‘ఇరుముడి’కి సంబంధించి లేటెస్ట్ ఈవెంట్లో అనిల్ మాట్లాడుతూ.. రవితేజ బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటైన ‘ఇడియట్’ నుంచి తన ఫేవరెట్ డైలాగ్ గుర్తు చేసుకున్నాడు.

అందులో థియేటర్ దగ్గర రక్షితతో మాట్లాడుతూ.. ‘‘మనదే ఇదంతా’’ అని రవితేజ అంటాడని, ఇప్పుడు నైజాం నుంచి వస్తున్న కలెక్షన్ చూసి ఈ డైలాగ్ యాప్ట్ అనిపిస్తోందని అన్నాడు. అనిల్ ఈ మాట అనగానే ఆడిటోరియంలోని అందరూ గొల్లుమన్నారు. రవితేజ కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. ఈ సందర్భంగా రవితేజ జాక్‌పాట్ కొట్టాడు అనే మాటను కూడా అనిల్ వాడాడు. తన మాట, రవితేజ రెస్పాన్స్ చూస్తే రవితేజ నైజాం రైట్స్ రూపంలో నిజంగానే జాక్ పాట్ కొట్టాడని స్పష్టమవుతోంది.