ఫౌజీ తప్పుకుంటే… స్పిరిట్ ఏం చేస్తుంది

భయపడినట్టే జరిగేలా ఉంది. డిసెంబర్ 3 అధికారికంగా ప్రకటించిన విడుదల తేదీని ఫౌజీ వదులుకునేలా ఉంది. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉండటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం అవసరం పడనుండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పదని టాక్. ఇది ఠక్కున గుర్తించిన నాగచైతన్య వృషకర్మ, దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ ఇప్పుడా డేట్ లాక్ చేసుకునేందుకు పరుగులు పెడుతున్నాయట. ఇటీవలే విశ్వక్ సేన్ ‘లెగసీ’ ఆల్రెడీ ప్రకటన ఇచ్చాడు కూడా.

అసలు పాయింట్ వేరే ఉంది. డిసెంబర్ నుంచి వెళ్ళిపోయిన ఫౌజీ మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది అసలు ప్రశ్న. ఎందుకంటే స్పిరిట్ మార్చి 5 వచ్చేందుకు అన్ని రకాలుగా రెడీ అవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్యాన్ ఇండియా లెక్కలు అన్నీ చూసుకునే ఆ స్లాట్ లాక్ చేసుకున్నారు. అందులోనూ తెలుగుతో పాటు హిందీ మార్కెట్ కీలకం కాబట్టి క్లాష్ లేకుండా చూసుకుని ఫౌజీ నిర్మాణ భాగస్వామి టి సిరీస్ సంస్థ పక్కా ప్లానింగ్ తో లాక్ చేసుకుంది సో తప్పుకునే ఛాన్స్ లేదు.

అలా అయితే మటుకు ఫౌజీ 2027 వేసవి లేదా అటుపై దసరా లేదంటే దీపావళి చూసుకోవాల్సి ఉంటుంది. సంక్రాంతి తలుపులు మూసుకున్నట్టే. ఎందుకంటే ఇప్పటికే హెవీ కాంపిటీషన్ ఉంది. ప్రభాస్ లాంటి హీరోల బడ్జెట్లు రికవరీ కావాలంటే సోలో రిలీజ్ దక్కాలి. కంటెంట్ బాలేని విషయం పక్కనపెడితే రాజా సాబ్ అనుకున్న దాని కన్నా ముందే క్రాష్ అవ్వడానికి కారణం పోటీనే. ఒకసారైనా చూద్దామనుకున్న జనాలు ఆప్షన్లు ఎక్కువ రావడంతో డార్లింగ్ ని లైట్ తీసుకున్నారు.

సరే రీజన్స్ ఏవైనా ఫౌజీ పోస్ట్ పోన్ మటుకు అభిమానులు జీర్ణించుకోలేనిది. కాకపోతే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి రెస్పాన్డ్ అవుతారేమో చూడాలి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీలో ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం కానుండగా పలువురు బాలీవుడ్ క్యాస్టింగ్ ఇందులో పెద్ద ఎత్తున భాగం పంచుకున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా ఉంటుందని టాక్.