నిహారికను అడిగే ధైర్యం లేదు – బన్నీ వాస్

ప్రతి వీకెండ్ బాక్స్ఆఫీస్ దగ్గర ఒకటికి మించి సినిమాలు రిలీజ్ అవ్వడం మామూలే. ఎక్కువగా చిన్న సినిమాలే పోటీలో ఉన్న సందర్భాల్లో కొత్త రిలీజుల నంబర్ పెరిగిపోతూ ఉంటుంది. డిసెంబరు రెండో వారాన్ని చిన్న సినిమాల కోసమే వదిలేయగా.. ఇప్పటికే మూడు నాలుగు చిత్రాలు ఆ వీకెండ్ రేసులో నిలిచాయి. అందులో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం.. ఇడుపు కాయితం. ప్రియదర్శి, నాగదుర్గ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వంశి రెడ్డి దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించాడు.

మరి ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండడం గురించి బన్నీ వాసును ప్రశ్నించగా.. తన మిత్రుడు వంశీ నందిపాటి ప్రొడ్యూస్ చేసిన ‘ఇంకా ఏం అనుకోలేదు’ సినిమాను పోటీ నుంచి తప్పించినట్లు వెల్లడించాడు. ఆ చిత్రాన్ని వాయిదా వేసుకోమని తాను వంశీకి కాల్ కూడా చేసి చెప్పలేదని.. జస్ట్ ఒక మెసేజ్ పెట్టానని, దానికి అతను బ్లాక్ మెసేజ్ తో రిప్లై ఇచ్చాడని.. తర్వాత ఇదేంటి అని అడిగితే, నువ్వు అడిగాక ఇక ఎలా కాదంటాను అని బదులిచ్చాడని బన్నీ వాసు వెల్లడించాడు.

అయితే ఇదే రోజు రిలీజ్ అవుతున్న నిహారిక కొణిదెల సినిమా పాకెట్ రాకెట్స్ గురించి అడిగితే బన్నీ వాసు ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. వంశీ నందిపాటి తాను తీసుకొచ్చిన మనిషి, తనే వర్క్ నేర్పించాను కాబట్టి అతడి సినిమాను వాయిదా వేసుకోమని ఈజీగా చెప్పేశానని, కానీ నిహారికను అడిగేంత ధైర్యం తనకు లేదని, ఎందుకంటే తనను ఇండస్ట్రీలోకి తెచ్చిందే వాళ్లని బన్నీ వాసు అన్నాడు.

మరి బన్నీ వాసుతో పాటు సుకుమార్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్న సినిమా కోసం నిహారిక రాజీపడి తాను ప్రొడ్యూస్ చేసిన సినిమాను వాయిదా వేసుకుంటుందా.. డిసెంబర్ 11న ఇడుపు కాయితం పోటీ లేకుండా రిలీజ్ అవుతుందా అన్నది చూడాలి.