పదమూడు సంవత్సరాలకు పెద్ద విజయం

టాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకులకు కొదవ లేదు. కాకపోతే వీళ్ళు వేగంగా సినిమాలు తీయడంలో దూకుడు చూపించకపోవడం వల్ల నెంబర్ చాలా తక్కువగా ఉంటుంది. పవన్ సాధినేని ప్రస్తుతం ఈ లిస్టులోనే ఉన్నారు. గత వారం విడుదలైన ఆకాశంలో ఒక తార బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. టీమ్ ప్రమోషన్లు ఆపకుండా క్రమం తప్పకుండా చేస్తూ ప్రేక్షకులను ఎక్కువ శాతం థియేటర్లకు వచ్చేలా చేయడంలో సక్సెసవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్.

ఇంత సాధించిన పవన్ సాధినేని ఇండస్ట్రీకి వచ్చి పదమూడు సంవత్సరాలు అయ్యింది. ఇంత సుదీర్ఘ ప్రయాణంలో తీసిన థియేట్రికల్ సినిమాలు కేవలం మూడే అంటే ఆశ్చర్యం కలగక మానదు. 2013 ప్రేమ ఇష్క్ కాదల్ అప్పటి యూత్ ని ఆకట్టుకుంది. పవన్ ప్రతిభకు గుర్తింపు వచ్చింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత నారా రోహిత్ హీరోగా తీసిన సావిత్రి ఆశించిన ఫలితం అందుకోలేదు. తర్వాత ఏకంగా ఆరు సంవత్సరాలు బ్రేక్ తీసుకుని ఓటిటి మూవీ సేనాపతితో కంబ్యాక్ అయ్యారు.

ఆహా కోసం చేసిన సేనాపతికి దక్కిన విజయం పవన్ సాధినేనిని అల్లు అరవింద్ దాకా తీసుకెళ్లింది. కొంచెం ఎక్కువ టైం పట్టినా ఆకాశంలో ఒక తారకు శ్రీకారం చుట్టబడి క్రమంగా స్వప్న సినిమా, గుణ్ణం గంగరాజు లాంటి పెద్ద చేతులు నిర్మాణ భాగస్వాములుగా చేరాయి. దుల్కర్ సల్మాన్ ని ఒప్పించడం దగ్గరే పవన్ సగం విజయం సాధించాడు. మిగిలింది సోషల్ మీడియాలో సాత్విక టాలెంట్ ని పసిగట్టడం ద్వారా పూర్తి చేశాడు. ఇప్పుడా ఫలితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ప్రస్తుతం అందరి కళ్ళు పవన్ సాధినేని నెక్స్ట్ ఎవరితో చేస్తాడనే దాని మీద ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తమిళ స్టార్ హీరో సూర్యతో ఈ కాంబో సెట్ అవ్వొచ్చని వినికిడి. ఒక లైన్ ఆల్రెడీ వినిపించడం జరిగిందని, ఫైనల్ నెరేషన్ అయ్యాక తుది నిర్ణయం తీసుకుంటారని టాక్. ఆకాశంలో ఒక తార ద్వారా క్లీన్ సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఖచ్చితంగా ఉంటుందని పవన్ సాధినేని ఋజువు చేసిన నేపథ్యంలో ఇకపై కూడా తన మీద అలాంటి అంచనాలలే ఏర్పడతాయి కాబట్టి ఇంకా బెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.