మాములుగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హుషారైన పాటలు, స్టెప్పులు, అల్లరి అన్నీ ఉంటాయి. మొన్నటికి మొన్న మన శంకరవరప్రసాద్ గారులో నయనతారతో లవ్ ఎపిసోడ్ పెడితే జనాలు బాగా ఎంజాయ్ చేశారు. వయసు గుర్తుకు రానంతగా మెగాస్టార్ తో మేజిక్ చేయించడంలో అనిల్ రావిపూడి సూపర్ సక్సెసయ్యారు. గాడ్ ఫాదర్, ఆచార్య తప్ప ఖైదీ నెంబర్ 150 నుంచి భోళా శంకర్ దాకా హీరోయిన్ ట్రాక్స్ అనేవి చిరు మూవీలో ఖచ్చితంగా ఉంటూ వస్తున్నాయి. అయితే కాకాకు మాత్రం ఈ విషయంలో ముందే ప్రిపేర్ అవ్వాల్సిందే.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం కాకాలో లవ్ ట్రాక్, హీరోయిన్ ఎపిసోడ్, రెగ్యులర్ డ్యూయెట్స్ లాంటివి ఏమి ఉండవు. పాత్ర పరిచయమే ఒక సామాన్యుడిగా, డాక్టర్ చదువుతున్న కూతురితో పాటుగా ఇంట్రో ఉంటుందట. భార్యగా స్నేహ చేశారని లీక్ ఉంది కానీ యూనిట్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కథ ప్రకారం ఫుల్ కిక్ ఇచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఎలివేషన్లు అన్నీ ఉంటాయి కానీ రొటీన్ గా ఆడిపాడే ఎలాంటి సాంగ్స్ ఇందులో ఉండవని తెలిసింది. అలాని నిరాశ చెందడానికి లేదు.
సగటు మూవీ లవర్స్ ఏమేం కోరుకుంటారో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కాకాలో పుష్కలంగా ఉండబోతున్నాయి. మొత్తం మూడు షేడ్స్ లో చిరంజీవిని కంప్లీట్ ప్యాకేజీగా ప్రెజెంట్ చేయబోతున్నారట. ముఖ్యంగా కోల్కతా ఎపిసోడ్ ఒక్కటే టికెట్ కు డబుల్ పైసా వసూల్ అనేది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. ఒక పాటలో చిరు ట్రేడ్ మార్క్ స్టెప్స్ ఉంటాయి కానీ అవి కూడా సందర్భోచితంగా వస్తాయి తప్పించి ఇరికించినట్టు ఉండదు. హుక్కు స్టెప్పు లాంటిది ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
జనవరి 13 విడుదలకు రెడీ అవుతున్న కాకా చివరి దశ షూటింగ్ లో ఉంది. సంక్రాంతికి విశ్వంభర వస్తుందని పుకార్లు లేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎలాంటి వాయిదా ఉండదని కాకా టీమ్ ప్రకటనలు ఇస్తూనే ఉంది. మెగా ఫ్యాన్స్ దీని మీద మాములు ఆశలు పెట్టుకోలేదు. కంటెంట్ కరెక్ట్ గా పడితే ఇంకో మూడు వందల కోట్ల గ్రాసర్ జేబులో ఉన్నట్టే. అనస్వర రాజన్ కీలక పాత్ర పోషిస్తున్న కాకాలో అనురాగ్ కశ్యప్ తో పాటు ఒక సర్ప్రైజింగ్ విలన్ ఉంటారని తెలిసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates