అర్జున్ రెడ్డిపై వంగది ఏ రేంజ్ కాన్ఫిడెన్స్ అంటే…?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4 కోట్లు పెట్టి స్వీయ నిర్మాణంలో సినిమా తీయడమంటే చిన్న సాహసమేమీ కాదు. అందుకోసం తన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన పొలాన్ని కూడా అమ్మేయడమంటే పెద్ద రిస్కే. కానీ విజయ్ దేవరకొండతో సందీప్ రెడ్డి చేసిన ఆ సాహసానికి గొప్ప ఫలితమే దక్కింది. వీరి కలయికలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే.

ఐతే ఆ సినిమా మేకింగ్ దశలో ఉన్నపుడు.. తమ ఫ్యామిలీ డబ్బులంతా దాని మీద పెట్టేశామే అని తాను టెన్షన్ పడ్డట్లు సందీప్ సోదరుడు, ఆ చిత్ర సహ నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను టెన్షన్ పడుతుంటే.. చాలా ధీమాగా సందీప్ చెప్పిన మాటను అతను గుర్తు చేసుకున్నాడు.

‘‘ఒక ఫస్ట్ లుక్ వదులుతా. ఒక టీజర్ రిలీజ్ చేస్తా.. తర్వాత ఒక ట్రైలర్ వదులుతా. అంతే ఈ సినిమాకు మొత్తం బిజినెస్ అయిపోతుంది’’ అని సందీప్ తనతో చెప్పినట్లు ప్రణయ్ తెలిపాడు. అతను చెప్పినట్లే ‘అర్జున్ రెడ్డి’ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వచ్చాక మొత్తం బిజినెస్ అయిపోయిందని అన్నాడు. ‘యానిమల్’ సీక్వెల్ ‘యానిమల్ పార్క్’ మరీ లేటవుతుండడంతో దీని మీద ఆసక్తి ఉంటుందా అని ఎవరో అంటే.. దీనికి కూడా ఒక టీజర్ వదిలితే చాలు జనం థియేటర్లకు వచ్చేస్తారని సందీప్ ధీమా వ్యక్తం చేసినట్లు అతను తెలిపాడు.

మరోవైపు ‘స్పిరిట్’ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకోవడం మీద జరుగుతున్న ప్రచారంపై ప్రణయ్ స్పందించాడు. సందీప్ అభీష్టానికి వ్యతిరకంగా ప్రకాష్ రాజ్ పొలిటికల్ ట్వీట్లు వేయడంతోనే ఆయన్ని తప్పించారని వస్తున్న రూమర్లు నిజం కాదని అతనన్నాడు. ప్రకాష్ రాజ్‌ను తప్పించడం అన్నది సందీప్ క్రియేటివ్ కాల్ అని.. దీనిపై పూర్తి వివరాల కోసం తననే అడగాలని ప్రణయ్ చెప్పాడు.