జైలర్ 2 అసలు సమస్య ఏంటి

వచ్చే నెల పదిహేను విడుదల కావాల్సిన జైలర్ 2 వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెన్నై వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ పోస్ట్ పోన్ పక్కా అనే తరహాలో వార్తలు తిరుగుతున్నాయి. ఇది ముందుగానే గుర్తించిన మైత్రి సంస్థ రణబాలిని అక్టోబర్ 16 ఫిక్స్ చేసిందనే ప్రచారంని అంత ఈజీగా కొట్టి పారేయలేం. జైలర్ 2 వచ్చే అవకాశాలు తగ్గిపోతే ఆదర్శ కుటుంబం ఏకె 47 ఆ స్లాట్ తీసుకునేలా ఉందట.

అసలేం జరుగుతోందో కనుక్కునే ప్రయత్నం చేస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. వాటిలో మొదటిది రీ షూట్స్. కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్స్ ప్రభుత్వం పనితీరు మీద విమర్శలు సంధించేలా ఉన్నాయట. వాటిని కనక విజయ్ అభిమానులు అపార్థం చేసుకుంటే లేనిపోని డ్యామేజ్ అవుతుందని భావించి కొన్ని కీలక మార్పులు చేస్తున్నారని వినికిడి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ వాటిని ఉద్దేశపూర్వకంగా పెట్టకపోయినా ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి.

అసలే విజయ్ గురించి అడిగినప్పుడల్లా రజనీకాంత్ మొక్కుబడిగా స్పందిస్తున్న తీరు ఫ్యాన్స్ లో చాలా అనుమానాలు రేపింది. ఇది ఎంత వరకు నిజమో కానీ జైలర్ 2 కనక వీటిని ఖండించాలన్నా లేదా రిలీజ్ డేట్ మారలేదని చెప్పాలన్నా వీలైనంత త్వరగా ప్రమోషన్లు మొదలుపెట్టాలి. ఇంకా చివరి దశ షూటింగ్ నడుస్తూ ఉందంటేనే లేనిపోని డౌట్లు వస్తాయి. ఇంకో నలభై అయిదు రోజులు మాత్రమే సమయముంది కాబట్టి సన్ పిక్చర్స్ టీమ్ పరుగులు పెట్టాలి.

ఇక బిజినెస్ విషయానికి వస్తే ఇప్పటికైతే డీల్స్ క్లోజ్ కాలేదు. తెలుగు రాష్ట్రాల హక్కులకు భారీ డిమాండ్ ఉండగా దానికి మించి అడుగుతున్నట్టు తెలిసింది. డిసి, విశ్వనాథ్ అండ్ సన్స్ లాంటి తమిళ డబ్బింగులు మన దగ్గర బాగా వర్కౌట్ అయ్యాయి. అలాంటిది జైలర్ 2 ఊహించనంత భారీగా వసూళ్లు తెస్తుందనేది నిర్మాతల ఆలోచన. ఇంకొద్దిరోజుల్లో ఫైనల్ కావొచ్చు. ఇటీవలే విడుదల చేసిన పూర్ణ స్పెషల్ సాంగ్ కు మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.