ప్యారడైజ్ నెల గురూ… ఇక ఆట షురూ

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్, సుదీర్ఘ కాలం నిర్మాణం జరుపుకున్న సినిమాగా ది ప్యారడైజ్ మీద అభిమానులు పెట్టుకున్న నమ్మకం అంతా ఇంతా కాదు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు మూవీ లవర్స్ ప్రతి ఒక్కరు ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టే అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఆయా షేర్, యెషనాగుల కట్ట మీద పాటలు ఒకదాన్ని మించి మరొకటి ఛార్ట్ బస్టర్ కావడం అంచనాలను ఆకాశాన్ని దాటించేశాయి.

ఇప్పుడు సెప్టెంబర్ నెల వచ్చేసింది. ఇంకో 23 రోజుల్లో ప్యారడైజ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో ఉంటుంది. ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ దృష్ట్యా టికెట్ రేట్ల పెంపు అనివార్యం కాబట్టి ఆడియన్స్ దానికి ముందే ప్రిపేరయ్యి ఉండటం అవసరం. ప్రస్తుతం అనిరుధ్ తో కలిసి యుఎస్ కాన్సర్ట్స్ లో రచ్చ చేస్తున్న నాని తిరిగి రాగానే ప్యాచ్ వర్క్, డబ్బింగ్ ఇతరత్రా పనులు ముగించేస్తాడు. టైం చాలా తక్కువ కనక పరుగులు పెట్టాలి.

అసలు ఛాలెంజ్ ప్రమోషన్ల దగ్గర ఉంటుంది. ప్యాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దానికి అనుగుణంగా పబ్లిసిటీ, ఈవెంట్లు, అవుట్ డోర్ వేడుకలు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. టాక్సిక్ మన దగ్గర ఎంత డిజాస్టర్ అయినా హిందీలో మొదటి రెండు మూడు రోజులు డీసెంట్ వసూళ్లు రాబట్టింది. అలాంటిది బలమైన కంటెంట్ ఉన్న ప్యారడైజ్ ని కనక సరిగ్గా ప్రమోట్ చేసుకుంటే బాలీవుడ్ లో వసూళ్ల వర్షం ఖాయం. నాని కోరుకున్న ఉత్తరాది గుర్తింపు బంగారు పళ్లెంలో దక్కుతుంది.

మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటించిన ఈ వయొలెంట్ యాక్షన్ డ్రామాలో కయదు లోహర్ హీరోయిన్ కాగా సంపూర్ణేష్ బాబు చాలా షాకింగ్ క్యారెక్టర్ లో విశ్వరూపం చూపిస్తాడని ఇన్ సైడ్ టాక్. ఇక జడల్ పాత్రలో నాని పెర్ఫార్మన్స్ చాలా కాలం పాటు చెప్పుకునేలా ఉంటుందట. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గతంలో నానితో చేసిన దసరాకు పదిరెట్లు ఎక్కువనిపించే మాస్ బొమ్మ ఇస్తున్నారని యూనిట్ సభ్యుల మాట. ముందైతే ప్రచారాన్ని వేగవంతం చేయాలి.