ఇక చిరు మీదే భారం

కేవీఎన్ ప్రొడక్షన్స్.. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన నిర్మాణ సంస్థ. ఈ బేనర్ మీద కన్నడలో ముందు కొన్ని చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తీసిన వెంకట్ కె.నారాయణ.. ఆ తర్వాత వివిధ భాషల్లో భారీ చిత్రాలను లైన్లో పెట్టారు. కన్నడలో ధృవ్ సర్జా హీరోగా కేడీ: ది డెవిల్ పేరుతో పెద్ద బడ్జెట్లో ఒక సినిమా చేసిన ఆయన..
తమిళంలో టాప్ స్టార్ అయిన విజయ్ చివరి చిత్రాన్ని నిర్మించే అవకాశం కోసం ఎంతోమంది పెద్ద ప్రొడ్యూసర్లు లైన్లో ఉంటే, వారిని కాదని అవకాశం దక్కించుకుని జననాయగన్ మూవీ చేశాడు.

మరోవైపు ‘కేజీఎఫ్’తో బంపర్ క్రేజ్ సంపాదించుకున్న యశ్ తర్వాతి చిత్రం ‘టాక్సిక్’ను ప్రొడ్యూస్ చేసింది కూడా ఆయనే. ఇవి కాక ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ రూపొందించే కొత్త సినిమా కూడా ఆయన చేతికే చిక్కింది. ఒక కొత్త నిర్మాతకు ఇన్ని బంపర్ ఆఫర్లు ఏంటి అనుకున్నారు. ఈ చిత్రాలతో ఆయన దశ తిరిగిపోతుందని.. ఇండియా అంతటా ఆయన పేరు మార్మోగిపోతోందని అనుకున్నారు. కానీ జరుగుతున్నది వేరు.

గత ఏడాది విడుదలైన కేడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. సంక్రాంతికి విడుదల కావాల్సిన జననాయగన్ సెన్సార్ సమస్యలతో చాన్నాళ్ల పాటు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. టాక్సిక్ సైతం రిలీజ్ డేట్‌ను అందుకోలేక వాయిదా పడింది. కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలూ నారాయణకు చేదు అనుభవాలే మిగిల్చాయి. జననాయగన్ బ్యాడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ విజయ్ క్రేజ్ వల్ల మెరుగైన వసూళ్లు సాధించినా అది సరిపోలేదు.

నారాయణకు భారీ నష్టం తప్పలేదు. ఇక లేటెస్టుగా టాక్సిక్ రూపంలో పెద్ద షాకే తగిలింది ఆయనకు. ప్రి రిలీజ్ హైప్ వల్ల తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ తర్వాత సినిమా నిలబడలేక పోయింది. చివరికి ఇది కూడా నారాయణ డిజాస్టర్ల జాబితాలోనే చేరింది. దీంతో ఇక ఆయన ఆశలన్నీ చిరు, బాబిల కాకా మూవీ మీదే నిలిచాయి. వచ్చే సంక్రాంతికి రానున్న ఈ చిత్రం లెక్కలన్నీ సరి చేస్తుందని నారాయణ ఆశిస్తున్నారు. ఆ సినిమా అటు ఇటు అయితే మాత్రం ఆయన కోలుకోవడం కష్టమే.