ఇరుముడి జోరుకు పగ్గాలు అసాధ్యం

టయర్ 1 హీరోలు, ప్యాన్ ఇండియా సినిమాలకు రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడటం సహజం. కానీ వాటికి కూడా మధ్యలో ఆక్యుపెన్సీ డ్రాప్స్, కింది సెంటర్లలో గ్రాసులు తగ్గిపోవడం మాములే. కానీ ఇరుముడి దానికి రివర్స్ లో వెళ్తోంది. రోజు రోజుకి వసూళ్లు ఎంతో కొంత తగ్గాల్సింది పోయి, పది రోజులకు కూడా స్లో అయ్యే ప్రసక్తే లేదన్న తరహాలో ర్యాంపేజ్ పదానికి స్పెల్లింగ్ రాయిస్తోంది. చాలా చోట్ల థియేటర్లు సరిపడా లేకపోవడంతో టికెట్లకు ఓ రేంజ్ లో డిమాండ్ నెలకొంది.

ఇది ఎప్పుడు ఆగుతుందనే ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేదు. టాక్సిక్ కు వచ్చిన టాక్ రవితేజకు పెద్ద ప్లస్ కానుంది. ఫ్యామిలీస్, యూత్, మాస్ అనే తేడా లేకుండా అందరూ ఇరుముడికే ఓటు వేస్తున్నారు. కొన్ని జిల్లా కేంద్రాల్లో రెగ్యులర్ షోలు సరిపోక ఉదయం ఎనిమిది గంటలకు అదనపు ఆటలు వేయడం అప్పుడెప్పుడో రాజమౌళి, ప్రభాస్ లాంటి వాళ్లకు మాత్రమే చూసిన అరుదైన ఫీట్. కానీ ఇరుముడి దాన్ని తేలికగా చేసి చూపిస్తోంది. దాదాపు అన్ని చోట్లా ఇదే సీన్.

ఇప్పటికే 150 కోట్ల గ్రాస్ దాటేసిన ఇరుముడి డబుల్ సెంచరీ పక్కాగా అందుకోనుంది. సోమవారం నుంచి కూడా స్టడీగా ఉంటుందని, ప్రతి ఒక్క థియేటర్ కు షేర్లు వస్తూనే ఉంటాయని, ఆల్రెడీ లాభాల్లో ఉన్న బయ్యర్లు ఆనందంలో మునిగి తేలుతున్నారని ట్రేడ్ రిపోర్ట్. పరిస్థితి ఎలా ఉందంటే ఇరుముడి ఓవర్ ఫ్లోస్ విశ్వనాథ్ అండ్ సన్స్ కు ఉపయోగపడుతున్నాయి. అది కూడా హిట్టయినప్పటికి ఫస్ట్ వీక్ తర్వాత స్లో అయ్యింది. ఇప్పుడు అనూహ్యంగా పికప్ కనిపించడం విశేషం.

నైజామ్, సీడెడ్, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బలంగా ఉన్న ఇరుముడి జోరు చూస్తుంటే దశాబ్దాల తర్వాత రవితేజ కెరీర్ లో యాభై రోజుల బొమ్మ పడేలా ఉందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. రాబోయే కొత్త రిలీజుల్లో దేనికైనా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఇరుముడి మీద జనాల ప్రేమ తగ్గదని అంటున్నారు. బుక్ మై షో ట్రెండింగ్ ఇప్పుడు రవితేజ పేరు మీదే కొనసాగుతోంది. టాక్సిక్ ఎక్కడో దూరంలో ఆగిపోగా మిగిలినవి నెమ్మదిగా లాగేస్తున్నాయి. కంటెంట్ పవర్ ఏంటో ఇరుముడి మరోసారి రుజువు చేసింది.