నాని మార్కెట్ లక్ష్యాలు… ఓదెల మాస్ అస్త్రాలు

మొన్నటిదాకా హాయ్ నాన్న, జెర్సీ అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా టార్గెట్ చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు పూర్తిగా మాస్ మీదే ఫోకస్ పెడుతున్నాడు. దసరా రూపంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తనకో నమ్మకం కలిగించాక దాన్ని మరింత పెంచే బాధ్యతని కూడా అతని మీదే పెట్టాడు. ఫలితమే ది ప్యారడైజ్. నాని కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్, వర్కింగ్ డేస్ తో రూపొందిన ఈ వయొలెంట్ థ్రిల్లర్ సెప్టెంబర్ 24 విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

తాజాగా యెషనాగుల కట్ట పాట రిలీజయ్యింది. మన శంకరవరప్రసాద్ గారుతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఆట సందీప్ కొరియోగ్రఫీలో నాని, కీర్తి సురేష్ చేసిన డాన్స్  ఓ రేంజ్ లో పేలేలా ఉంది. గుంటూరు కారంలో కుర్చీ మడతపెట్టి రేంజ్ లో రీచ్ వస్తుందని నాని అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. విజువల్ గా చూస్తే ఆ ఛాన్స్ ఉందనిపిస్తుంది కానీ ఇంకొన్ని రోజులు ఆగితే ఎక్కడిదాకా వెళ్తుందో స్పష్టత వస్తుంది. పోలిక ఎలా ఉన్నా యెషనాగుల కట్ట చాలా దూరం వెళ్లడం ఖాయం.

ఇక్కడ శ్రీకాంత్ ఓదెల స్ట్రాటజీని అభినందించి తీరాలి. ఎందుకంటే అనిరుధ్ రవిచందర్ ని తీసుకున్నప్పుడు సాధారణంగా బీట్స్ ప్రధానంగా సాగే పాటలు చేయించుకుంటారు. దేవరకు జరిగింది అదే. కానీ ఓదెల ఆ రూట్లో వెళ్ళలేదు. మల్టీప్లెక్స్ లో ఆనందించే ఒక ఉద్యోగి నుంచి అయిదు రూపాయల టీ తాగే ఒక కూలి వరకు అందరికీ కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఆయా షేర్ రాబట్టుకున్నాడు. అంచనాలకు తగ్గట్టుగానే అది ఎక్కడికో వెళ్లి కూచుంది.

ఇప్పుడు రెండో సాంగ్ గా యెషనాగుల కట్టను ఎంచుకోవడం సూపర్ ప్లాన్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఒక్క పాటతో కలెక్షన్లు పెరుగుతున్న ట్రెండ్ మనం గమనిస్తున్నాం. ఇరుముడిలో ముత్యాల పల్లకి వల్లే ఓ పది కోట్లు అదనంగా వచ్చాయని ఎవరైనా అంటే దాన్ని ఖండించలేం. థియేటర్లో చూస్తే నిజమే అనిపిస్తుంది. అలా ఇప్పుడీ ప్యారడైజ్ కి ఆయా షేర్, యెషనాగుల కట్ట రెండూ మాస్ ని ఊపడం ఖాయం. జడల్ పాత్రలో నాని విశ్వరూపాన్ని ఇవి తోడైతే అంతకన్నా ఫ్యాన్స్ కోరుకునేది ఏముంది.