నేచురల్ స్టార్ నాని కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం.. ది ప్యారడైజ్. ఇంతకుముందు నానికి ‘దసరా’ రూపంలో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి తెరకెక్కిస్తుండడం.. ఈ మూవీకి సంబంధించి ప్రతి ప్రోమో ఎగ్జైటింగ్‌గా ఉండడంతో అంచనాలు వేరే స్థాయికి వెళ్లిపోయాయి. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో యువ కథానాయిక అనంతిక సనిల్ కుమార్ నటించాల్సిందట. కానీ కొంచెం చిత్రమైన కారణంతో ఆ సినిమాలో ఛాన్స్ మిస్సయినట్లు.. అనంతిక తాజాగా వెల్లడించింది.
తనలో ఇంకా పోని చిన్నతనపు ఛాయల వల్ల ‘ది ప్యారడైజ్’ సహా పలు చిత్రాల్లో అవకాశాలు కోల్పోయినట్లు అనంతిక తెలిపింది. చాలామంది తన ఫొటోలు పంపమని అడుగుతుంటారని.. కానీ చివరికి తనకు నో చెబుతారని.. అందుక్కారణం తాను చిన్నపిల్లలా అనిపించడమే అని ఆమె చెప్పింది. ఇదే కారణంతోనే తాను నాని మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశాన్ని కూడా కోల్పోయినట్లు అనంతిక చెప్పింది.
అంటే కాయదు లోహర్‌ను కథానాయికగా ఫైనలైజ్ చేయడానికి ముందు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.. అనంతిక పేరును కూడా పరిశీలించాడన్నమాట. ఈ సినిమా చాలా రా అండ్ రస్టిగ్గా రూపొందుతున్నప్పటికీ.. కథానాయిక పాత్ర మాత్రం క్లాస్‌గానే కనిపిస్తోంది. అయినా సరే.. అనంతికను ఎంచుకోలేదంటే నాని పక్కన చిన్నపిల్లలా అనిపిస్తుందనేనేమో. ఒకవేళ ఇలాంటి క్రేజీ సినిమాలో అవకాశం అందుకుని ఉంటే.. అనంతిక కెరీర్‌కు అది గొప్ప మలుపే అయ్యేదేమో.
తెలుగులో నటించిన తన తొలి చిత్రం ‘మ్యాడ్’లో అనంతిక చేసింది ఇంజినీరింగ్ అమ్మాయి పాత్ర కావడంతో దానికి బాగానే సూటైంది. తర్వాత ‘8 వసంతాలు’లో ఎంతో పరిణతితో కూడుకున్న పాత్రను కూడా బాగానే చేసింది. త్వరలో ఆమె సందీప్ రెడ్డి వంగ ప్రొడక్షన్లో రాబోతున్న ‘రోమాంచకం’తో ప్రేక్షకులను పలకరించబోతోంది. క్లాసికల్ డ్యాన్సర్ అయిన అనంతికకు ఇప్పుడు 20 ఏళ్లే. కానీ చూడ్డానికి ఆమె ఇంకా చిన్నమ్మాయిలా కనిపిస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates