పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రీఎంట్రీ మూవీగా ‘పింక్’ రీమేక్‌ను ఎంచుకోవడం అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో పవన్ చేసేదేముంది అనుకున్నారు. ఒరిజినల్లో అమితాబ్ బచ్చన్ చేసిన పాత్రతో పోలిస్తే పవన్ పాత్రను పెంచినా సరే.. పవర్ స్టార్ రీఎంట్రీ మూవీ నుంచి తాము ఆశించే అంశాలైతే ఇందులో ఉండవనే ఫిక్సయిపోయారు. ‘పింక్’ రీమేక్ కథాంశాన్ని బట్టి చూస్తే ఇలాంటి సీరియస్ సినిమాలో పవన్ మార్కు హీరో ఎలివేషన్లకు అంతగా ఛాన్స్ ఉండదనే అంతా అనుకున్నారు.
తమిళంలో అజిత్ లాంటి మాస్ హీరో ‘పింక్’ రీమేక్‌లో నటించగా.. ఆయన అభిమానులు ఆశించిన స్థాయిలో ఎలివేషన్లు లేకపోయాయి. వారు ఒకింత నిరాశ వ్యక్తం చేశారు. ఇలాంటి సినిమాల్లో కథను అనుసరించి వెళ్లిపోవాలి తప్ప హీరో ఎలివేషన్లు, మాస్ అంశాలు అంటే సినిమా చెడిపోతుందనే బలమైన అభిప్రాయం అందరిలోనూ ఉండిపోయింది.
కానీ తెలుగు రీమేక్‌కు చిత్ర బృందం ధైర్యం చేసి ‘వకీల్ సాబ్’ అనే హీరోను ఎలివేట్ చేసే టైటిల్ పెట్టింది. పవన్‌ను ఒక మాస్ సినిమాలో చూపించినట్లే ఫస్ట్ లుక్ డిజైన్ చేసింది. దీంతో ఒక్కసారిగా ‘వకీల్ సాబ్’ను చూసే దృష్టే మారిపోయింది. మధ్యలో రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్లోనూ పవన్ మాత్రమే హైలైట్ అయ్యాడు. అభిమానులను అలరించేలా కనిపించాడు. ఇక ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్‌తో ‘వకీల్ సాబ్’ కలరే మారిపోయినట్లు అయింది. ఈ సినిమా ఎలా ఉండబోతోందో అర్థమైపోయింది.
ఒరిజినల్లో అత్యంత కీలక పాత్రలుగా ఉన్న ముగ్గురు అమ్మాయిలు బ్యాక్ సీట్ తీసుకోబోతుండటం ఖాయం. వారి వరకు కథాంశం మారకపోయినా.. కథనాన్ని మార్చి, వారి పాత్రల నిడివిని కొంచెం తగ్గించబోతున్నారన్నది స్పష్టం. అలాగే పవన్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్.. వర్తమానంలో ఎలివేషన్ సీన్లు, ఫైట్లు ఇవన్నీ తోడవబోతున్నాయి. దీని వల్ల ఓవరాల్‌గా సినిమా నిడివి పెరగబోతోంది. మొత్తంగా ఒక బలమైన కథాంశాన్ని కమర్షియల్ స్టయిల్లో చెప్పే ప్రయత్నం చేయనున్నాడన్నమాట దర్శకుడు వేణు శ్రీరామ్. ఐతే మార్పులు, చేర్పుల వల్ల సినిమా ఏమీ దెబ్బ తినకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి టీజర్ వరకు చూస్తే. ఇవన్నీ వర్కవుట్ అయితే.. ‘గబ్బర్ సింగ్’ స్టయిల్లోనే ఇది కూడా మంచి విజయాన్నందుకునే అవకాశాలున్నాయి.