అల్లరోడి వింటేజ్ కామెడీకి పెద్ద పరీక్ష  

చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక. టైటిల్ లాగే కాన్సెప్ట్ కూడా కొంచెం ఓల్డ్ ఫాంటసీ ఫార్ములాలోనే ఉంది కానీ లేటెస్ట్ ట్రెండ్స్ ఫాలో అవుతూ పూర్తిగా నవ్వించే ప్రయత్నమైతే చేశారు. స్వర్గం నుంచి ముగ్గురు అందగత్తెలు భూమి మీద వస్తే వాళ్ళ కోసం ఇంద్రుడు, యముడు పడే పోటీ, కింద హీరో చేసే రకరకాల విన్యాసాలు వెరసి డిఫరెంట్ గా చేసే ప్రయత్నమైతే కనిపించింది. దీనికి దర్శకుడు చంద్రమోహన్ చింతాడ.

ఒకప్పుడు ఇలాంటి హాస్యభరిత చిత్రాలకే జనం బ్రహ్మరథం పట్టారు. సుడిగాడు, కత్తి కాంతారావు, బెండు అప్పారావు, అత్తిలి సత్తిబాబు లాంటివి నిర్మాతలకు మంచి లాభాలు ఇచ్చాయి. అయితే ఇదే అల్లరి నరేష్ ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో చేసిన యముడికి మొగుడు ఫ్లాప్ కావడం గమనించాల్సిన విషయం. ఇదంతా గతం. ఇప్పుడు జెన్ జీ బ్యాచ్ సినీ ప్రియులను దృష్టిలో పెట్టుకుని బోయపాటి శీను, పవన్ కళ్యాణ్ ఓజిని ఇమిటేట్ చేయడం లాంటివి బాగానే జొప్పించారు.

అన్నపూర్ణ నిర్మాణ భాగస్వామ్యంలో రూపొందుతున్న రంభ ఊర్వశి మేనక మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుంటోంది. ఒకవేళ క్లిక్ అయితే ఈజీగా గట్టెక్కిపోతుంది. గత రెండు మూడు నెలలుగా టాలీవుడ్ ఫ్లాప్ హీరోలందరూ కంబ్యాక్ అందుకున్నారు. ఇరుముడితో రవితేజ, లెనిన్ తో అఖిల్, మా ఇంటి బంగారంతో సమంత, విశ్వనాథ్ అండ్ సన్స్ తో సూర్య, పెద్దితో రామ్ చరణ్ ఇలా అందరికీ ఘనవిజయాలు దక్కాయి. రంభ ఊర్వశి మేనక ఆ లిస్టులో చేరుతుందేమో చూడాలి.

సెప్టెంబర్ 4 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న ఈ సినిమాకు భయపడేంత కాంపిటీషన్ లేదు. కాకపోతే టాక్సిక్ వచ్చిన వారానికే రిలీజ్ కావడం, ఇరుముడి రెండు మూడు వారాలు స్ట్రాంగ్ గా ఉండే అవకాశాలు స్పష్టంగా ఉండటం లాంటివి కొంత ప్రభావం చూపించవచ్చు. రాశి సింగ్, విష్ణు ప్రియా, ప్రిషా సింగ్ టైటిల్ రోల్స్ పోషించిన రంభ ఊర్వశి మేనకలో సురభి హీరోయిన్ గా నటిస్తోంది. నరేష్, వెన్నెల కిషోర్ లాంటి సీనియర్లు చాలానే ఉన్నారు. కంటెంట్ బాగుంటే క్లిక్ అయిపోతుంది.