హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ స్క్రీన్ ఉన్నప్పటికీ.. తర్వాత అక్కడి నుంచి తీసేశారు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఐమాక్స్ తెరలుండగా.. హైదరాబాద్‌ ప్రేక్షకులు మాత్రం వాటికి నోచుకోకపోవడం విచారకరమే. ఐతే కొంచెం లేటుగా అయినా హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ రాబోతోంది.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఇంతకుముందు సుదర్శన్ 70ఎంఎం థియేటర్ ఉన్న ప్రదేశంలో నిర్మిస్తున్న ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో ఒక స్క్రీన్లో ఐమాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది రిలీజ్ కానున్న రాజమౌళి, మహేష్ బాబుల సినిమా ‘వారణాసి’తో ఈ స్క్రీన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఐతే ఆలోపే ఇంకో ఐమాక్స్ స్క్రీన్ రాబోతుండడం విశేషం. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఐమాక్స్ తెర కంటే ఇది పెద్దదని సమాచారం.

క్రాస్ రోడ్స్‌లో ఏఎంబీని నిర్మిస్తున్న ఏషియన్ సంస్థనే హకీం పేట ఏరియాలో భారీ మాల్ నిర్మిస్తోంది. ఇక్కడ ఏఎంబీ స్క్రీన్ రానున్నట్లుగా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఐమాక్స్ స్క్రీన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల తిరుపతిలో ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ రాబోతున్నట్లు వెల్లడించిన ఒక థియేటర్ నిపుణుడు.. హైదరాబాద్‌లో రెండో ఐమాక్స్ రాబోతోందని కూడా తెలిపాడు. పైగా అది ట్రూ ఐమాక్స్ స్క్రీన్ అని చెప్పడం విశేషం.

ట్రూ ఐమాక్స్ అంటే.. 1.43:1 రేషియో. అంటే ఐమాక్స్ స్క్రీన్లలో అత్యంత పెద్దది ఇదే. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రాబోతున్నది స్కోప్ ఐమాక్స్ స్క్రీన్ అని సమాచారం. హకీంపేటలో ఐమాక్స్ వస్తుందని ఏషియన్ మూవీస్ అధినేత సునీల్ నారంగ్ రెండేళ్ల ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తర్వాత దాని గురించి క్లారిటీ లేకపోయింది. కానీ ఇప్పుడు ఆ సమాచారం నిజమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే హైదరాబాదీ సినీ ప్రియులకు పండగన్నట్లే.