అనుపమకు నరకం చూపించిన అపరిచితుడు

తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న మ‌ల‌యాళ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ప‌దేళ్ల కెరీర్లో పెద్ద‌గా ఎఫైర్ వార్త‌లేమీ వ‌చ్చింది లేదు. కానీ ఏడాది ముందు తాను క‌లిసి న‌టించిన యంగ్ హీరోతో ప్రేమ‌లో ప‌డ్డ‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. త‌ర్వాత ఆ ప్ర‌చారం నిజ‌మే అని తేలింది. కానీ ఇటీవ‌ల ఆ బంధం నుంచి బ‌య‌టికి వ‌చ్చేసింది అనుప‌మ‌. క్రిప్టిక్ పోస్టుల ద్వారా ఆ విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది అనుప‌మ‌.

నెమ్మ‌దిగా ఆ రిలేష‌న్‌షిప్ గురించి ఆమె ఓపెన్ అవుతోంది. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో త‌న ప్రేమ‌క‌థ‌, బ్రేకప్‌కు సంబంధించి ఆమె సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించింది. తాను ప్రేమ‌లో ఉన్న వ్య‌క్తి పేరు చెప్ప‌కుండా తాను ఒక విష‌పూరిత‌మైన బంధం (టాక్సిక్ రిలేష‌న్‌షిప్‌)లో ఉన్న‌ట్లు వ్యాఖ్యానించింది అనుప‌మ‌.

త‌న మాజీ ల‌వ‌ర్ చాలా ప్ర‌మాద‌క‌రం అన్న‌ట్లుగా ఆమె మాట్లాడింది. అత‌ను ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాడంటూ అన్నియ‌న్ (అప‌రిచితుడు) క్యారెక్ట‌ర్‌ను గుర్తు చేసింది అనుప‌మ‌. ఒక రోజు అత‌ను రెమోలా ఉంటాడ‌ని, ఎంతో ప్రేమ‌గా మాట్లాడ‌తాడ‌ని, ఇంత ప్రేమించే వ్య‌క్తి ఇంకొక‌రు ఉండ‌ర‌న్న‌ట్లే ఉంటాడ‌ని.. కానీ త‌ర్వాతి రోజు ఉన్న‌ట్లుండి అప‌రిచితుడిగా మారిపోతాడ‌ని, త‌న‌ను భ‌రించ‌డం చాలా క‌ష్ట‌మ‌వుతుంద‌ని అనుప‌మ చెప్పింది.

తాను ఆ వ్య‌క్తితో రిలేష‌న్‌షిప్‌లోకి వెళ్లిన మూడు నెల‌లకే అత‌డి కుటుంబం త‌మ ఇద్ద‌రికీ ఎంగేజ్మెంట్ చేయాల‌ని అనుకుంద‌ని, కానీ అత‌డికి చాలా త‌క్కువ వ‌య‌సు కావ‌డంతో తాను ఆగాన‌ని అనుప‌మ చెప్పింది. ఆ రిలేష‌న్‌షిప్‌లో ముందుకు వెళ్లే కొద్దీ చాలా ఇబ్బందులు ప‌డ్డాన‌ని.. త‌న కెరీర్లో పెద్ద హిట్ మూవీ అయిన డ్రాగ‌న్‌ను కూడా తాను ప్ర‌మోట్ చేసుకోలేక‌పోయాన‌ని.. అలా తాను ఉచ్చులో బిగుసుకుపోయాన‌ని ఆమె వ్యాఖ్యానించింది. ఆ బంధంలో ఉన్న‌పుడు ఎవ‌రైనా ఎలా ఉన్నావు అని అడిగితే ఏడ్చేసే ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లు ఆమె చెప్పింది. ఈ రిలేష‌న్‌షిప్ నుంచి బ‌య‌టికి వ‌చ్చాక త‌న‌కు స్వేచ్ఛ ల‌భించిన‌ట్ల‌యింద‌ని ఆమె పేర్కొంది.