డిసి సినిమాలో అంత విశేషముందా

అసలు ప్రమోషన్లు లేకుండా ఏదైనా సినిమాకు బజ్ లేదా ఓపెనింగ్స్ రావడం మహా కష్టమైపోయిన ట్రెండ్ లో ఉన్నాం మనం. అది డబ్బింగ్ మూవీ అయితే ఇక చెప్పేదేముంది. అసలది వచ్చిన సంగతే జనాలకు తెలిసేలోపు థియేటర్ల నుంచి మాయమైపోతోంది. కానీ డిసి కేసు విచిత్రంగా ఉంది. కొరియన్ కనకరాజుతో పాటు ఇవాళ థియేటర్లలో అడుగు పెట్టిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు సోషల్ మీడియాలో ప్రశంసలు దక్కుతున్నాయి. అధిక శాతం ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉండటం గమనార్హం.

కథగా చెప్పుకుంటే ఇందులో ఎక్స్ ట్రాడినరిగా ఏమి ఉండదు. తండ్రి ఉన్నా నేర ప్రపంచం వల్ల గ్యాంగ్ తో పాటు పెరిగిన ఒక నేరస్థుడు, ఆరేళ్ళ వయసు నుంచే బలవంతంగా వ్యభిచార గృహంలో అడుగు పెట్టి పధ్నాలుగేళ్ళు నరకం చూసిన ఒక వేశ్య మధ్య స్నేహం, క్రమంగా ప్రేమగా మారి ఎన్నో నేరాల్లో భాగం పంచుకునేలా చేస్తుంది. దొంగతనాల నుంచి హత్యల దాకా క్రైమ్ పార్ట్ నర్స్ గా మారిపోతారు. అసలు డిసి అంటే ఏంటి, చివరికి ఏమయ్యారు అనేదే స్టోరీ.

పాయింట్ పరంగా మరీ కొత్తదనం లేకపోయినా దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ట్రీట్ మెంట్ తో మేజిక్ చేశారు. కామెడీ అనేది మచ్చుకు కూడా లేకుండా రెండు గంటల ఇరవై నిమిషాల పాటు సీరియస్ నెరేషన్, అధిక శాతం హింస చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ డ్రామాలో హీరో లోకేష్ కనగరాజ్, వామికా గబ్బిల జంట చేసే యాక్షన్ విన్యాసాలు బాగా పేలాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే బ్రోతల్ హౌస్ మర్డర్స్ ఎపిసోడ్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది.

అలాని మైనస్సులు లేవా అంటే ఉన్నాయి. నెమ్మదిగా సాగే సీన్లు, అక్కడక్కడా ఇబ్బంది పెట్టే ల్యాగ్ ఇందులో కూడా లేకపోలేదు. అయితే అనిరుద్ రవిచందర్ ఇలాంటి వీక్ నెస్ లను కాపాడుకుంటూ వచ్చారు. బిజిఎంలోని డెప్త్ వల్ల యూత్ ఈ కంటెంట్ కి బాగా కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ డే కాంప్లిమెంట్స్ ని పక్కనపెడితే కమర్షియల్ గా ఇది ఏ స్థాయికి వెళ్తుందనేది ఆదివారం దాకా వేచి చూస్తే క్లారిటీ వస్తుంది. కొరియన్ కనకరాజు హడావిడిలోనూ డిసి ఇంత అటెన్షన్ తెచ్చుకోవడం విశేషమే.