అల్లు అర్జున్ 23… అప్పుడే ఇన్ని ప్రచారాలా  

ఇంకా రాకా షూటింగ్ పూర్తి కాలేదు. మూడు నెలలకు పైనే వర్కింగ్ డేస్ అవసరమవుతాయని అంటున్నారు. అందుకే విడుదల తేదీ ప్రకటించే విషయంలో దర్శకుడు అట్లీ, నిర్మాతలు తొందరపడటం లేదు. దీని తర్వాత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ అంటూ దానికెంత సమయం పడుతుందో చెప్పలేం. హీరోయిన్ దీపికా పదుకునే వరకు పోర్షన్స్ త్వరగా పూర్తి చేసుకుని పంపిస్తున్నారు. గర్భవతి కావడంతో తగినన్ని జాగ్రత్తలు తీసుకుని రిస్క్ లేకుండా ఫినిష్ చేస్తున్నారు.

దీంట్లో షారుఖ్ ఖాన్ క్యామియో చేస్తాడనే ప్రచారం ఓ రెండు రోజులు గట్టిగా చక్కర్లు కొట్టింది. తనకు జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అభిమానంతో అట్లీకు ఓకే చెప్పి ఉంటాడనే కోణంలో వార్తలు వడ్డించేశారు. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2లోనే క్యామియో వద్దనుకున్న కింగ్ ఖాన్ ఇప్పుడు బన్నీ కోసమో లేదా అట్లీ కోసమో మెట్టు దిగే పరిస్థితిలో లేడు. రాకా వ్యవహారమే ఇంకా తేలలేదంటే అప్ప్పుడే అల్లు అర్జున్ 23 గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి.

ఇదలా ఉండగా తాజాగా షాహిద్ కపూర్ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పటిదాకా ఇతను సౌత్ సినిమాల్లో నటించింది లేదు. బాబీ డియోల్ నుంచి అనిల్ కపూర్ దాకా చాలా మంది ఎంట్రీ ఇచ్చారు కానీ ముగ్గురు ఖాన్లతో పాటు షాహిద్ లాంటి అతి కొందరు కేవలం హిందీకి మాత్రమే పరిమితమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అసలు బన్నీ 23కి తన పేరు పరిశీలనలో లేదట. కేవలం ప్రతిపాదనగా అనుకుని ఉండొచ్చు కానీ కలవడం లాంటివి జరగలేదని టాక్.

ఇంకో ట్విస్టు ఏంటంటే పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకోవచ్చనే న్యూస్ కూడా జనాల నోళ్ళలో నానింది. కూలిలో ఐటెం సాంగ్ చేసింది కాబట్టి అలా ముడిపెట్టేశారన్నమాట. నిజానికి లోకేష్ కనగరాజ్ గత కొన్ని వారాలుగా తాను హీరోగా నటించిన డిసి ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. దానికి దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ అయినప్పటికీ తన వంతుగా పోస్ట్ ప్రొడక్షన్ లో లోకేష్ పాలు పంచుకున్నాడు. ఇంకో నెల రోజుల్లో అల్లు అర్జున్ 23 తాలూకు పనులను పూర్తి స్థాయిలో మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది.