మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, రాజకీయ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు, ఆ సమయంలో చోటుచేసుకున్న ఘటనలతో ఇక్కడి రాజకీయం వేడెక్కింది. అయితే.. ఇప్పుడు సొంత పార్టీలో మరో చర్చ సాగుతోంది. ఎటు చూసినా టీడీపీ మాటే వినిపిస్తుండడం సీనియర్లను మరింత కలవరానికి గురి చేస్తోంది.
ఈ నెల 3న వెలువడిన పులివెందుల మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది. మొత్తం 40 వార్డుల్లో ఏకగ్రీవాలతో కలిపి 37 వార్డులను కూటమి గెలుచుకోగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 వార్డులకు పరిమితమైంది. టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి గీతా కుమారి తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రమీలమ్మపై 13,875 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇది వైసీపీకి మరింత ఇరకాటంగా మారింది. స్వయానా చిన్నమ్మను గెలిపించుకోలేక పోయారన్న అపప్రద జగన్‌పై పడింది.
ఇక, పులివెందుల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బొంగాని భారతి యాదవ్ తన సమీప వైసీపీ అభ్యర్థిపై 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేకాకుండా, 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 స్థానాలు కూటమికి ఏకగ్రీవమయ్యాయి. ఇది కూడా వైసీపీ నాయకత్వాన్ని, క్షేత్రస్థాయి కేడర్‌ను కూడా డోలాయమానంలో పడేసింది. పోలింగ్ సందర్భంగా టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నా.. అధినాయకత్వం.. తమకు సరైన మార్గదర్శనం చేయలేదన్న చర్చ కూడా దిగువస్థాయి నాయకుల్లో ఉంది. దీంతో ఇప్పుడు వారంతా కూడా మౌనంగా ఉండిపోయారు.
పులివెందుల ప్రజలు కూడా వైసీపీని దూరం పెట్టడం ఆ పార్టీలో చర్చకు దారితీసింది. గతానికి భిన్నంగా ఇక్కడ 70 శాతం పోలింగ్ నమోదు కావడం.. అన్నింటా వైసీపీ డింకీలు కొట్టడం.. ఎటు చూసినా టీడీపీ నేతలు గెలుపు గుర్రాలు కావడంతో ఎక్కడ తేడా జరిగిందన్న అంశంపై కూడా విశ్లేషణ చేయడం లేదన్న చర్చ ఉంది. వరుసగా మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఎదురైన ఓటములతో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొనగా, దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ కంచుకోటగా ఉన్న ప్రాంతంలో విజయం సాధించడంతో టీడీపీ కూటమి ఉత్సాహంగా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
